కరోనా విజృంభణ.. ఆరు రాష్ట్రాల్లో హైఅలర్ట్
కరోనావైరస్ మరోసారి విజృంబిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాప్తిపై ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి హైఅలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ గుజరాత్, మహారాష్ట్ర , తెలంగాణ , కర్నాటక , కేరళ ప్రభుత్వాలకు లేఖ రాసింది. నిర్దారణ పరీక్షలు, చికిత్స , ట్రాకింగ్ , వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. దేశవ్యాప్తంగా ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్న వేళ కేంద్రం కరోనా అలర్ట్ జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరో వేవ్ తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలు మళ్లీ కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని చెబుతోంది ఐసీఎంఆర్. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా చర్యలు చేపట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వికి లేఖ రాసింది. గత రెండు వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఈ నెల 8 వ తేదీ నాటికి కేవలం 132 ఉన్న కోవిడ్ కేసులు.. 15వ తేదీ నాటికి 267కి చేరడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణకు జిల్లా స్థాయినుంచి కార్యాచరణ ప్రారంభించాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఎక్కడికక్కడ టెస్ట్ లు చేయడంతో పాటు.. కాంటాక్ట్ లను ట్రేస్ చేయడం, బాధితులకు చికిత్స అందించాలని ఆదేశించింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పింది.
దేశంలో గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న చెబుతూనే ఉంది కేంద్ర ఆరోగ్య శాఖ. మార్చ్ 8 నాటికి దేశ వ్యాప్తంగా 2082 కోవిడ్ కేసులు ఉండగా, ఈ నెల 15 నాటికి ఆ సంఖ్య 3264 కి పెరిగిందని స్పష్టం చేసింది. తెలంగాణ సహా కేస్ లు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు తప్పక కరోనా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.