Nithin​ బర్త్​డే స్పెషల్​.. బ్లాక్​బస్టర్​ మూవీ రీరిలీజ్​!

ప్రస్తుతం టాలీవుడ్​లో రీరిలిజ్​ ట్రెండ్​ కొనసాగుతోంది. వారం వారం కొత్త సినిమాలతోపాటు స్టార్​ హీరోల సూపర్​ హిట్​ సినిమాలు రీరిలీజ్​ అవుతూ మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇప్పటికే మహేష్​ నటించిన పోకిరి, రామ్​ చరణ్​ ఆరెంజ్​, పవర్​ స్టార్​ సినిమాలైన జల్సా, ఖుషి రీరిలీజ్​ అయ్యి మరోసారి ప్రేక్షకులను అలరించాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి యంగ్ హీరో నితిన్ సినిమా చేరబోతోంది. నితిన్‌, నిత్యామీన‌న్ జంట‌గా న‌టించిన మొదటి సినిమా ఇష్క్​. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పుడు బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకుని నితిన్​ కెరీర్​కి చాలా ప్లస్​ అయ్యింది. అందుకే నితిన్​ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మార్చి 29న రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్​. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా 2012లో రిలీజైన ఈ సినిమాకు విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న నితిన్ ఈ సినిమాతోనే తిరిగి విజ‌యాల బాట ప‌ట్టారు. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గానే కాకుండా రెండు నంది అవార్డుల‌ను కూడా ఇష్క్ సొంతం చేసుకుంది. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుని చాలాకాలంపాటు మారుమోగాయి. ఆ తర్వాత నితిన్​, నిత్యా మీనన్​ కాంబినేషన్లో వచ్చిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమా కూడా సూపర్​ హిట్​గా నిలిచిన విషయం తెలిసిందే.

కాగా, నితిన్​ నటించిన మాచర్ల నియోజకవర్గం భారీ అంచనాల మధ్య విడుదలై నెగెటివ్​ టాక్​ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నితిన్ వ‌క్కంతం వంశీ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఇటీవ‌లే వెంకీ కుడుముల డైరెక్ష‌న్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. రష్మికా మందన్నా హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్​ ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్​ చిరంజీవి మొదటి షాట్​కి క్లాప్​ కొట్టి షూటింగ్​ ప్రారంభించారు. వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్​, రష్మిక హీరోహీరోయిన్లుగా వచ్చిన భీష్మ మంచి విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి మరి.