AstraZeneca: కోవిషీల్డ్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్.. ఎట్ట‌కేల‌కు ఒప్పుకున్న కంపెనీ

AstraZeneca: బ్రిట‌న్‌కి చెందిన ఫార్మా దిగ్గ‌జ కంపెనీ ఆస్ట్రాజెనెకా కంపెనీ నుంచి కేంద్రం కొనుగోలు చేసిన కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ‌ని ఆ కంపెనీ ఎట్ట‌కేల‌కు ఒప్పేసుకుంది. రక్తం గ‌డ్డ క‌ట్ట‌డం, బ్ల‌డ్ ప్లేట్లెట్లు ప‌డిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కోర్టుకు అందించిన ప‌త్రాల్లో వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

యూకేకి చెందిన జ‌నాభాలో దాదాపు 51 మంది కోవిషీల్డ్ తీసుకోవ‌డం వ‌ల్ల త‌మ‌కు అనారోగ్య స‌మస్య‌లు వ‌చ్చాయ‌ని మ‌రికొంద‌రు చ‌నిపోయార‌ని స్థానిక కోర్టులో పిటిష‌న్ వేసారు. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రాజెనెకా బాధిత కుటుంబాల‌కు 100 మిలియ‌న్ పౌండ్లు ప‌రిహారంగా ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం.. వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను ఒక డాక్యుమెంట్‌లో స‌బ్మిట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తుల్లో ఒక‌రైన జేమీ స్కాట్ పిటిషన్‌లో తొలి ఫిర్యాదుదారుడు. త‌న‌కు ర‌క్తం గ‌డ్డ క‌ట్టడంతో శాశ్వ‌తంగా మెద‌డు దెబ్బ‌తినింద‌ని పేర్కొన్నాడు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి దుష్ప్ర‌భావాలు చాలా త‌క్కువ కేసుల్లో జ‌రుగుతుంటాయ‌ని ఆస్ట్రాజెనెకా ఎట్ట‌కేల‌కు కోర్టు ముందు ఒప్పుకుంది. అయితే ఎప్పుడైతే పిటిష‌న్ వేసారో అప్పుడు జ‌రిగిన వాద‌న‌ల స‌మ‌యంలో కోవిషీల్డ్ వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వ‌ని ఆస్ట్రాజెనెకా బ‌ల్ల గుద్ది చెప్పింది. వాదోప‌వాదాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇప్పుడు త‌న మాట‌ల‌ను వెన‌క్కి తీసుకుని నిజాన్ని ఒప్పుకోవ‌డంతో ఆస్ట్రాజెనెకాపై ఇత‌ర దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.