మరోసారి తగ్గేదేలే అన్న సీఎం జగన్‌.. చిలకలూరిపేటలో ఫైర్‌!

ఇటీవల ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జరిగిన విద్యాదీవెన నిధులు జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్‌.. అతి సాధారణంగా మాట్లాడారు. ప్రతిపక్షాలను పల్లెత్తి మాట కూడా అనలేదు. దీంతో అందరూ జగన్‌ వెనక్కు తగ్గారని భావించారు. కానీ ఇవాళ చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రతిపక్షాలను ఏకిపారేశారు. సవాళ్లు విసురుతూ.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపారు. తనపై తోడేళ్లు అన్నీ ఏకమై గుంపుగా వస్తున్నాయని.. అయినా తగ్గేదేలే.. ఎంతమంది ఏకమై వచ్చినా ప్రజల దీవెనలు ఉన్న తనను ఏమీ చేయలేరని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. వారు చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ‘వాళ్లలా తనకు అర్థబలం, అంగబలం లేదనీ.. వాళ్లకు లేనిది తనకు ఉంది.. అదే దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు’ అని సీఎం జగన్‌ అన్నారు. తనను ఎదుర్కోలేక చంద్రబాబు, ఎల్లోమీడియా, దత్తపుత్రుడు కలిసి కుయుక్తులు పన్నుతున్నారని.. ప్రజల అండ ఉన్నంత వరకు ఎవ్వరినైనా ఎదుర్కొంటానన్నారు. తనను ఒంటరిగా ఎదుర్కొలేక ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు చేస్తున్నారని ‘మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి’ అని సీఎం జగన్‌ కోరారు. దీనికి ముందు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ప్రారంభించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అంటే ఇదే..
రాష్ట్రంలోని ప్రతి పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది అందుబాటులో ఉంటారు. ఇందులో ఓ డాక్టర్‌ పీహెచ్‌సీలో విధుల్లో ఉంటారు.. మరో డాక్టర్‌ పీహెచ్‌సీ పరిధిలోని గ్రామ సచివాలయాల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా అక్కడి ప్రజలకు మందులు ఇవ్వనున్నారు. ఈ ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని సీఎం జగన్‌ భావించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పథకం గురించి సీఎం జగన్‌ ఏమన్నారంటే..
దేశంలో గొప్ప మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం జగన్‌ అన్నారు. అందులో భాగంగానే దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారి వైద్యసేవల విధానంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇకపై రాష్ట్రంలో డాక్టర్‌ కోసం ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. నేరుగా పింఛన్లు ఇస్తున్న మాదిరిగానే.. ఇంటి వద్దకే డాక్టర్‌ వస్తారని ఆయన చెప్పారు. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్‌ ఉంటుందని.. వైఎస్సార్ విలేజ్‌క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తామని.. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఇక్కడ సాధారణ వైద్య సేవలతోపాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని తెలిపారు. గత టీడీపీ పాలనలో వైద్య ఆరోగ్య రంగంపై రూ. 8 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ ప్రభుత్వంలో వైద్యారోగ్యంపై రూ.18 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామన్నారు. వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీని నీరుగార్చారన్నారు సీఎం జగన్ మండిపడ్డారు. ఖరీదైన కార్పోరేట్‌ వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించిన మహానేత వైఎస్సార్‌ అని కొనియాడారు. ఫ్యామిలీ డాక్టర్‌ పరిధిలో నయం కాని ఆరోగ్య సమస్యలను విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ఆరోగ్యశ్రీకి రిఫర్‌ చేస్తామని తెలిపారు. ఇకపై ఎవరూ ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని.. వైద్యులే గ్రామానికి వచ్చి సేవలు అందిస్తారన్నారు.