Anand Mahindra: అతనే భవిష్యత్తు ఛాంపియన్​!

Hyderabad: టాలెంట్​ ఎక్కడున్నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). తనకు స్ఫూర్తినిచ్చిన పలు వీడియోలు, ఫొటోలను సోషల్​ మీడియలో షేర్​ చేస్తూ అందరితో పంచుకుంటారు. తాజాగా వైరల్​గా మారిన ఓ అథ్లెట్​ వీడియోని పోస్ట్​ చేసిన ఆనంద్​ మహీంద్రా ఇకనుంచి అతడిని ఫాలో అవనున్నట్లు చెప్పుకొచ్చారు.

భారత దేశంలో ఆర్చరీ(archery) దుస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ కోచ్ సుధీర్ ఓ ట్వీట్ చేశారు. ‘ధనుర్బాణాలు ధరించిన శ్రీరాముడు, అర్జునుడు నడయాడిన ఈ నేలపై ఆర్చరీ పూర్తిగా నిరాదరణకు గురువుతోంది. మీలో ఎంతమందికి ప్రథమేశ్ సమధన్ జావ్కర్ గురించి తెలుసు?’ అంటూ ప్రథమేశ్ అనే ఓ యువ ఆర్చరీ క్రీడాకారుడి వీడియోను షేర్ చేశారు. సుధీర్ షేర్ చేసిన వీడియోలో ప్రథమేశ్ శ్రద్ధ, చెక్కుకెదని లక్ష్యశుద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యంపై దృష్టిపడగానే అతడు ప్రపంచాన్నే మర్చిపోయాడు. గురి చూసి బాణం వదలగానే అది బ్రహ్మాస్త్రంలా లక్ష్యాన్ని ఛేదించింది. అలా మూడు సార్లు లక్ష్యాన్ని గురి చూసి కొట్టిన ప్రథమేశ్ ఛాంపియన్‌గా నిలిచాడు.

ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా కూడా అతడి టాలెంట్ చూసి ముగ్ధుడైపోయాడు. ‘ఇది నిజంగా అద్భుతం. చెక్కుచెదరని శ్రద్ధ ఇతడి సొంతంలా కనిపిస్తోంది. ఇతడిలో నాకు ఓ భవిష్యత్తు ఛాంపియన్ కనిపిస్తున్నాడు. నిజమే.. ఇప్పటివరకూ నేనూ ఇతడి గురించి వినలేదు. కానీ ఇకపై కచ్చితంగా ఇతడిని ఫాలో అవుతా. సెప్టెంబర్‌లో జరగబోయే టోర్నమెంట్‌లో ఇతడు విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. ఇత‌నికి ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి కూడా ఫిదా అయిపోయారు. ఆర్చ‌రీలో గోల్డ్ మెడ‌ల్ సాధించినందుకు గ‌ర్వంగా ఉందంటూ ట్వీట్ చేసారు.