ఆ మగాడు అగ్నిపరీక్ష పాస్.. అయినా డబ్బులు కట్టాలని వేధింపులు

త్రేతాయుగంలో రావణుడి చెర నుంచి విముక్తి పొందిన సీతమ్మతల్లి.. తన ప్రాతివత్యాన్ని నిరూపించుకునేందుకు అగ్నిగుండంలోకి దూకింది.. ఈ సంగతి అందరికీ తెలిసిందే.. అయితే.. ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కలియుగంలో కూడా ఓ మగాడికి ఈ కష్టం వచ్చిపడింది. అతనికి వేరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని నిందమోపారు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. దీంతో వారు పది లక్షల జరిమానా… లేదా తాము విధించే శిక్ష అనుభవించాలని పెద్దలు సూచించారు. అసలు ఇంతకీ అతను ఎవరు? పెద్దలు వేసిన శిక్ష ఏంటి? అందులో నెగ్గాడా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

ములుగు జిల్లా బంజరుపల్లి గ్రామానికి చెందిన గంగాధర్‌ వివాహితుడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆ మహిళ భర్త ఆరోపించాడు. అంతేకాకుండా పెద్దలు తనకు న్యాయం చేయాలని ఆ గ్రామంలోని పెద్ద మనుషుల దగ్గరకు విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో స్పందించిన వారు.. గంగాధర్‌ను పిలిపించి పంచాయితీ చేశారు. కానీ ఇరు వర్గాలు చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా పెద్దలు సంతృప్తి చెందలేదు. దీంతో ఇరువుని నుంచి 11 లక్షల రూపాయలు డిపాజిట్‌ చెల్లించుకున్నారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. పలు మార్లు పంచాయితీలు జరిగినా.. నిజం బయటకు రాలేదు. దీంతో 10 లక్షలు డబ్బు అయినా చెల్లించు.. లేదా నిప్పుల్లో ఉండే గడ్డపార పట్టుకుని నీ నిజాయితీని నిరూపించుకోమని గంగాధర్‌కు గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో గడ్డపార పట్టుకునేందుకు అతను సిద్దమయ్యాడు.

కణకణ నిప్పుల్లో ఉన్న గడ్డపార పట్టుకుని..
గంగాధర్‌ తన నిజాయతీని నిరూపించుకునేందుకు ఫిబ్రవరి 25న.. కణకణ మండుతున్న నిప్పుల్లో వేసిన గడ్డపారను పట్టుకునేందుకు సిద్దమయ్యాడు. ముందుగా దగ్గర్లో ఉన్న కాలువలో మునిగి.. తడి బట్టలతో కొలిమి వద్దకు వచ్చాడు. మూడు సార్లు ఆ నిప్పుల కొలిమిని దాటారు. అనంతరం నిప్పుల మధ్యలో వేసిన గడ్డపారను ధైర్యంగా పక్కకు వేసేశాడు. అయినా చేతికి చిన్న గాయం కూడా అవ్వలేదని గంగాధర్‌ పేర్కొన్నారు. అయితే .. గ్రామ పెద్దలు గంగాధర్‌ అనుభవించిన శిక్షను పట్టించుకోలేదు. నువ్వు తప్పు చేశావ్‌ అంటూ.. పది లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగాధర్‌..
పంచాయితీ చేసేందుకు ముందుగా గ్రామ పెద్దలకు డిపాజిట్ చెల్లించిన ఆరు లక్షల రూపాయలు తనకు ఇవ్వట్లేదని గంగాధర్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా గంగాధర్‌ పోలీసులకు అన్ని విషయాలను చెప్పేశాడు. తనను నిప్పుల కొలిమిలో ఉన్న గడ్డపారను పట్టుకోవాలని గ్రామ పెద్దలు తొలుత సూచించారు. అది తాను చేశానని.. ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ.. ముందుగా చెల్లించిన తన డబ్బును పెద్దలు ఇవ్వట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు మీరే న్యాయం చేయాలంటూ.. గంగాధర్‌, అతని భార్య పోలీసులను వేడుకున్నారు. దీంతోపాటు ఇలాంటి ఆటవిక ఘటనలు ఆ గ్రామంలో ఎక్కువయ్యాయని.. పెద్దలే అన్ని పంచాయతీలు శిక్షలు వేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.