15 మంది విద్యార్థులకు కరోనా.. ఎలా సోకిందంటే?

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఇటీవల ముగ్గరు విద్యార్థులు వారి సొంతూర్లకు వెళ్లిరాగా.. అప్పటి నుంచి వారు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీన్ని గమనించిన పాఠశాల స్టాఫ్‌ నర్సు వారిని ఈ నెల 4న జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌, మరొకరికి నెగెటివ్‌గా నివేదికలు వచ్చాయి. పాజిటివ్‌ వచ్చిన వారితో కలిసి తిరిగిన 48 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 13 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు గురువారం తెలిసింది. కొవిడ్‌ సోకిన మొత్తం 15 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులతో ఇళ్లకు పంపినట్లు రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ (ఆర్‌సీవో) రాజ్యలక్ష్మి తెలిపారు. మిగిలిన విద్యార్థులను పాఠశాలలోని ఓ గదిలో ప్రత్యేకంగా ఉంచామని, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు. పాఠశాల వాచ్‌మెన్‌కు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది.