Animal గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక సినీ సెలబ్రిటీ
Animal: సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) తీసిన యానిమల్ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్లు రాబడుతోందో అందరికీ తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ (ranbir kapoor), రష్మిక మందన (rashmika mandanna) నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఈ సినిమా అద్భుతంగా ఉందని అల్లు అర్జున్, హరీష్ శంకర్, రామ్ గోపాల్ వర్మ, త్రిష వంటి సెలబ్రిటీలు తెగ ప్రశంసలు కురిపించారు. అయితే త్రిష మాత్రం సినిమా గురించి పాజిటివ్‌గా ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసారు.
ఎందుకంటే ఓ అమ్మాయికి.. అందులోనూ ఒక హీరోయిన్‌కి ఈ సినిమా నచ్చిందంటే సమాజం ఊరుకోదు. సినిమాలో చూపించిన కంటెంట్ అలాంటిది మరి. రేప్ సీన్లు.. ఆడవారిని తక్కువ చేసి చూపించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇందులో. మరి ఇలాంటి సినిమాను మన దేశం అత్యధిక వసూళ్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబెట్టిందంటే సమాజం ఎటుపోతోందో తెలీడంలేదు. కబీర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు హీరోయిన్ని చెంపపై కొట్టే సీన్‌ని పట్టుకుని నానా హంగామా చేసారు. ఇలాంటి టాగ్జిక్ మగవారిని హీరోల్లా చూపించకండి అని వేడుకున్నారు. అయినా కూడా సందీప్ రెడ్డి వంగా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేదు.
సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరైనా ఇలాంటి సినిమాలు తీయకండి అని మాట్లాడతారేమో అని ఎదురుచూస్తున్న తరుణంలో అప్పుడొచ్చాడు ఒకడు. దళపతి విజయ్ 68వ సినిమాకు సినీమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ్ నూని. ఇదొక సినిమానా ఇలాంటివి మన ఎంకరేజ్ చేస్తున్నామా అంటూ ఇచ్చిపడేసాడు. నిన్న సిద్ధార్థ్ యానిమల్ సినిమా చూడటానికి వెళ్లాడట. సినిమా చూసాక అసలు ఇలాంటి సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన మన దేశ యువత ఎటు పోతున్నారు అని ప్రశ్నించాడు.
ఏదో ఆల్ఫా మేల్ అంటూ నోటికొచ్చిన థియరీలతో ఇలాంటి టాగ్జిక్ మగజాతిని సృష్టించి ఆడవారిని అసభ్యకరంగా చూపించడంలో గొప్ప ఏముందని నిలదీసాడు. ఇలాంటి ఒక అడల్ట్ సినిమాకు హైదరాబాద్‌లోని చాలా థియేటర్ల వద్ద పిల్లలు కూడా రావడం చూసానని.. సెన్సార్ బోర్డు ఇలాంటి సినిమాలను ఓకే చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోందని ఆవేదన వ్యక్తం చేసాడు.