తన ఆరోగ్య పరిస్థితిపై సుస్మితా సేన్​ కామెంట్స్​

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఇటీవలే​ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే సుస్మితా స్వయంగా ఇన్​స్టా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియో షేర్​ చేశారు. ఈ వీడియోలో తాను ఇటీవల తీవ్రమైన గుండెపోటు గురయ్యానని, ప్రధాన రక్తనాళం చాలా వరకూ మూసుకుపోయిందని సకాలంలో వైద్యులు చికిత్స చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తనపై ప్రేమను చూపించిన అభిమానులకు, చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

‘ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకోసం దేవుడిని ప్రార్థించినందుకు ధన్యవాదాలు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మాట్లాడటానికి గొంతు సహకరించడం లేదు. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వీడియో షేర్‌ చేస్తున్నా. నా వాయిస్‌ విని అనారోగ్యంగా ఉన్నానని అనుకోకండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. గడిచిన కొంతకాలంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరికిపై ప్రేమను చూపించండి. ఇటీవల నేను తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాను. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. అక్కడి వైద్యులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమించి.. ప్రమాదం నుంచి బయటపడేలా చేశారు. నా కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే ఈ విషయం తెలుసు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదు. చికిత్స పూర్తై.. నేను కోలుకున్న తర్వాతనే సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాను. దాన్ని చూసి.. ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ ఎంతోమంది పోస్టులు పెట్టారు. నాపై ప్రేమను చూపించిన వారందరికీ మరోసారి కృతజ్ఞతలు. త్వరలోనే ‘ఆర్య-3’ షూట్‌లో పాల్గొంటా. మీ అందర్నీ అలరిస్తా’ అని సుస్మిత వెల్లడించారు.
విశ్వసుందరిగా గెలుపొందిన అనంతరం సుస్మిత వెండితెర వేదికగా సినీ ప్రియులకు చేరువయ్యారు. ‘నాయక్‌’, ‘సమయ్‌’, ‘వాస్తు శాస్త్ర’, ‘పైసా వసూల్‌’, ‘అలగ్‌’, ‘నో ప్రొబ్లమ్‌’ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైన ఆమె 2020లో వచ్చిన ‘ఆర్య’ సిరీస్‌తో మరోసారి కెమెరా ముందుకు వచ్చారు. వ్యక్తిగత జీవితంపై చాలా విమర్శలు ఎదుర్కొన్న సుస్మిత కొంతకాలంగా సోషల్​ మీడియాకు దూరంగా ఉన్నారు.