Saiee Manjrekar: ఆ హీరోలతో నటించాలని ఉంది!

Hyderabad: కరోనా తర్వాత థియేటర్లకు కళ తెచ్చిన అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను(Boyapati Srinivas), ఎనర్జిటిక్​ హీరో రామ్​ పోతినేనితో (Ram Pothineni) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్​లో రామ్​ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన కన్నడ భామ శ్రీలీల (Sreeleela) హీరోయిన్​గా నటిస్తోంది. కాగా,  తాజాగా ఈ చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్లు ముంబై భామ సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) తెలియజేసింది.

సయీ మంజ్రేకర్.. సల్మాన్ ఖాన్ (Salman Khan) దబాంగ్ 3 తో సినిమా వెండితెరకి పరిచయమైంది. టాలీవుడ్ లోనూ మెగా హీరో వరుణ్ తేజ్ సరసన గని సినిమాలో నటించి అలరించింది. అయితే ఈ భామకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘మేజర్’. అడివిశేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్న సయీ.. తాజాగా రామ్​ చిత్రంలో సెకండ్​ హీరోయిన్​గా ఛాన్స్​ దక్కించుకుంది.

తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రామ్ నిజంగా ఎనర్జిటిక్‌ స్టార్. మూవీ సెట్ లో చాలా ఉత్సాహంగా ఉంటారు. సీన్స్ చిత్రీకరణ టైంలో నాకు చాలా సహాయపడేవారు. ఈ మూవీతో మీరంతా ఒక సరికొత్త రామ్ ని చూడబోతున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సౌత్ హీరోల గురించి మాట్లాడుతూ.. ‘సౌత్​లో ఎన్టీఆర్(NTR)​, అల్లు అర్జున్(Allu Arjun)​, రామ్​ చరణ్(Ram Charan)​ క్రేజ్​ ఎంటో చెప్పక్కర్లేదు. చాలా గొప్ప యాక్టర్స్​. నాకు వాళ్లతో కలిసి నటించాలని ఉంది’ అంటూ మనసులో మాట బయటపెట్టింది ఈ ముంబై భామ.