Harish Shankar: పుష్పపై పవన్ కామెంట్స్.. గొడ్డళ్లతో థియేటర్లకు వెళ్లారా?
Harish Shankar: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవుల సంరక్షణపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వారం రోజుల క్రితం పవన్ కర్ణాటకలో పర్యటించారు. అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రేను కలిసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దుల మీదుగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే అంశాలపై చర్చించామని తెలిపారు. ఆ సమయంలో పవన్ మాట్లాడుతూ… ఒకప్పుడు సినిమాల్లో హీరోలను అడవులను రక్షించేవారిగా చూపించేవారని.. కానీ ఇప్పుడు అదే హీరో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడం.. అడవులను దోచేయడం వంటివి చూపిస్తున్నారని అన్నారు.
దాంతో.. పవన్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా గురించే అన్నారని అందరికీ క్లియర్‌గా అర్థమైంది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. తాను పవన్ కళ్యాణ్‌తో, అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసానని పవన్ నిజ జీవితంలో చాలా నిజాయతీగా ఉంటారని అన్నారు. ఇప్పుడు ఆయన ఉపముఖ్యమంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున తన బాధ్యతలను గుర్తుచేసుకుంటూ ఆ వ్యాఖ్యలు చేసారే తప్ప పుష్ప గురించో లేక మరో సినిమా గురించో ప్రస్తావించలేదని తెలిపారు. సినిమాల్లో చూపించే ప్రతీ విషయాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకోరని.. అలాగైతే పుష్ప సినిమా చూసినవారెవ్వరూ గొడ్డళ్లతో థియేటర్లకు రాలేదుగా అని సెటైర్ వేసారు. కానీ పుష్ప సినిమా నుంచి స్ఫూర్తి పొందే కొందరు దుండగులు ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసారని వచ్చిన వార్తల గురించి హరీష్ శంకర్ మర్చిపోయినట్లున్నారు.