రామ‌య్య‌ను దేవుడిగా మార్చిన 5 సూత్రాలు

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కొన్ని సుగుణాలు ఉంటాయి. కానీ సర్వగుణ సంపన్నుడు శ్రీరాముడు. తండ్రి మాట జవదాటని కొడుకుగా, రాజ్యప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సుపరిపాలన చేసిన గొప్ప రాజుగా, భార్యకోసం సప్తసముద్రాలు దాటి లంకను జయించిన భర్తగా, ఏకపత్నీవ్రతుడిగా, మంచి స్నేహితుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. తన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా శ్రీరాముడు సత్యాన్ని, ధర్మాన్ని వీడలేదు. మనిషిగా పుట్టిన రాముడిని దేవుడిగా మలచిన లక్షణాలేంటో శ్రీరామ నవమి సందర్భంగా తెలుసుకుందాం..
వేకువజామునే లేవడం
యుగయుగాలుగా హిందూ సనాతన సంప్రదాయంలో రామ నామమే తారక మంత్రంగా విలసిల్లుతోంది. హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు అవతారంగా భావించే శ్రీరాముని ఆరాధన అన్ని దుఃఖాలు, కష్టాలను తొలగించి సుఖ సంపదలను ప్రసాదిస్తుందని నమ్ముతారు భక్తులు. మానవునిగా పుట్టి నడత, నడవడికతో పురుషోత్తముడుగా ఖ్యాతి గడించిన శ్రీరాముడు ఈ సర్వజగత్తుకే ఆదర్శప్రాయుడు. పురాణాలపరంగా రాముడు సూర్యవంశస్థుడు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. ఉదయించే సూర్య భగవానుని పూజించేవాడు. ఉదయమే నిద్రలేవడం వలన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు జీవితంలోని సగం సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆలోచనలతో జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు. శ్రీరామునిలోని ఈ గుణాన్ని మీలో పెంపొందించుకుంటే.. లక్ష్యాన్ని సాధించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి మార్గం సుగమమవుతుంది.
నిర్వహణ
రాముడు నిర్వహణ కళలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. తన వనరులను, ప్రజలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆయనకు తెలుసు. రాముడు ఇతరులలోని లక్షణాలను పరిశీలించడం ద్వారా వారి నుండి అత్యుత్తమ గుణాలను తీసుకునేవాడు. హనుమంతుడిని లంకకు పంపడం, సంజీవని మూలికను తెచ్చే విషయం, సముద్రాన్ని దాటేందుకు వంతెనగా నిర్మించే బాధ్యత ఇలా ప్రతి విషయంలోనూ రాముడి ఆలోచన విధానం కనిపిస్తుంది.
వినయం
అందరి పట్ల సమాన వైఖరి రామాయణ కథానాయకుడిగా పిలుచుకునే శ్రీరాముడు చాలా వినయం గలవ్యక్తి. అందరిని సమాన దృక్పథంతో చూసేవాడు. చిన్నా పెద్దా అందరిని సమానంగా చూస్తాడు. పడవ నడిపే వ్యక్తి నుంచి అష్ట-సిద్ధి దాత అయిన మహాబలి హనుమంతుడి సహా అందరిని సమదృష్టితోనే చూశాడు. వారిని కౌగిలించేకూరి వారి పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయోధ్యకు రాజుగా అయినప్పటికీ తన మనస్సులో ఎటువంటి విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంతేకాదు ప్రేమతో శబరి పెట్టిన ఎంగిలి పండ్లను అత్యంత ఇష్టంగా తిన్నాడు. సమాజంలోని అన్ని వర్గాల నుండి శ్రీరాముడికి ప్రేమ, మద్దతు లభించడానికి ఇదే కారణం.
గౌరవం
సంబంధాలను గౌరవించే గుణం తన జీవితంలో ఏర్పడిన అన్ని సంబంధాలను గౌరవిస్తూ.. రామయ్య తన తర్వాత తరాల వారికీ ఉదాహరణగా నిలిచాడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ఇంట్లో రామయ్య వంటి కొడుకు, సోదరుడు, స్నేహితుడు, యజమాని కావాలని కోరుకుంటున్నారు. అంటే దీనికి కారణం రాముడు బంధాల పట్ల చూపించిన బాధ్యతనే.. రాముడు తన ప్రతి బంధానికి గౌరవం ఇస్తూ తన భావాలను విస్మరించలేదు. తన తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మొత్తంరాజ్యాన్ని విడిచిపెట్టాడు. సుగ్రీవుడు, విభీషుణుడు వంటి వారితో చేసిన రాముడి స్నేహం.. నేటికీ గొప్ప ఉదాహరణగా నిలిచింది. రాముడికి హనుమంతుడు గొప్ప భక్తుడు.
సమానత్వం
ప్రతిఒక్కరికీ ఉదాహరణగా ఉండడం కోసం మహావిష్ణువు అవతారమైనా, లోకరక్షకుడైనా, సమస్త శక్తులను కలిగి ఉన్నా, రాముడు ఎప్పుడూ సామాన్య మానవుడిగానే జీవించాడు. జీవితానికి సంబంధించిన అతి పెద్ద సవాళ్లను అధిగమించేందుకు పరిమిత మార్గాల్లో అపరిమిత లక్ష్యాలను నిర్దేశించుకుని సామాన్యుడిలా సాధించి చూపించాడు. జీవితంలో ఎదురైన కష్టాలు, సమస్యలను తన సుగుణాలతో అవలీలగా జయించి లోకాభిరాముడిగా విలసిల్లుతున్నాడు.
శ్రీరాముడు ఆచరించిన ఈ సుగుణాలను ఆచరిస్తే ప్రతి ఒక్కరికీ విజయం దక్కుతుందనడంలో సందేహం లేదు. న్యూస్​ ఎక్స్​ తెలుగు ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.