What the Fish: ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేసిన మంచు మ‌నోజ్!

Hyderabad: పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్​ హీరో మంచు మనోజ్(Manchu Manoj)​ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నేడు(మే 20) పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ సినిమాల్లోకి వస్తున్నట్లు హింట్​ ఇచ్చారు. పుట్టినరోజు కానుకగా కొత్త సినిమా అప్​డేట్​ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రముఖులు మనోజ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నారు.

మనోజ్​ పుట్టిన రోజు సందర్భంగా వాట్​ ది ఫిష్(What the Fish) స్పెషల్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. ఈ పోస్టర్​లో మనోజ్​ సీరియస్​ లుక్​లో కనిపిస్తున్నారు. విశాల్​ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించిన పూర్తి విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్​. మనోజ్​ బర్త్​డే సందర్భంగా మరో ప్రాజెక్ట్​ అప్​డేట్​ కూడా ఇచ్చారు. ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ మీద శ్రీమతి మమత సమర్పణలో ప్రొడక్షన్ నెం.3(Production No.3)గా ఈ సినిమా రాబోతోంది. ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్​.