Mangoes: పండ్లలో కెమికల్స్‌ని ఇలా కనిపెట్టేయొచ్చు!
Hyderabad: వేసవి కాలం(Summer) వచ్చిందంటే ఎక్కడ చూసినా పసుపు రంగులో నిగనిగలాడుతూ మామిడి పండ్లు(Mangoes) నోరూరిస్తుంటాయి. కానీ వాటిలో ఎక్కువగా కృత్రిమంగా కార్బైడ్(Carbide) ఉపయోగించి పండించేవే. సహజంగా పండించిన పండ్లలో ఉండే పోషకాలేవీ వీటిలో ఉండవు. అంతేకాదు కార్బైడ్ ఉపయోగించి మగ్గించిన పండ్లను తింటే వాంతులు, అజీర్ణం, విరేచనాలు వంటి పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే మామిడి పండ్లను కృత్రిమంగా పండించారో లేదో కనిపెట్టేయవచ్చు. కృత్రిమంగా మగ్గించిన పండ్లను ఎలా కనిపెట్టాలో చూద్దాం..
ముందుగా మామిడి పండు రంగును పరిశీలించాలి. సహజంగా పండిన పండ్ల రంగు పండంతా ఒకేలా ఉంటుంది. కృత్రిమంగా పండించిన పండ్లైతే అక్కడక్కడా ఆకుపచ్చ రంగు మచ్చలను కలిగి ఉంటాయి.
వాసన ద్వారా కూడా కృత్రిమంగా పండిన పండ్లను కనిపెట్టవచ్చు. సహజంగా పండిన పండ్లు కమ్మని వాసన కలిగి ఉంటాయి. కార్బైడ్ వినియోగించిన పండ్ల వాసన ఘాటుగా ఉంటుంది.
కృత్రిమంగా పండించిన పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, కార్బైడ్ వాడకం వల్ల త్వరగా పాడవుతాయి. పండుపై పాడైన మచ్చలను బట్టి ఇట్టే కనిపెట్టేయచ్చు. అంతేకాదు కార్బైడ్ వాడిన పండ్ల తొక్కలు రసాయనాల వల్ల మృదువుగా మారిపోతాయి. సహజంగా పండిన పండ్ల తొక్క నిండైన రంగుతో దృఢంగా ఉంటుంది.
ఎన్ని రకాలుగా పరీక్షించినా ఓ కాయ రుచి చూసి కొనడమే మంచిదంటున్నారు నిఫుణులు. సహజంగా పండిన పండు తియ్యగా ఉంటుంది. కృత్రిమంగా పండిన పండ్లు పైకి నిండుగా కనిపించినా అంత తియ్యగా ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఇలా టెస్ట్ చేసి కొనెయ్యండి.