బుల్లితెరనూ ఒక ఊపుఊపేస్తున్నారు !
ప్రేక్షకులను అలరించడమే నటీనటుల ప్రధాన లక్ష్యం. తమ నటనతో సినిమాల్లో హీరోహీరోయిన్లుగా రాణిస్తూనే బుల్లితెరపైనా ప్రేక్షకులను పలకరిస్తూ అందరి అభిమానం పొందుతున్నారు పలువురు టాలీవుడ్ తారలు. రియాలిటీ షోలు, టాక్ షోలు, గేమ్ షోలతో తెలుగు ప్రేక్షకులకు బుల్లి తెరపైనా మరింత వినోదాన్ని పంచుతున్న టాలీవుడ్ తారలెవరో చూద్దాం..
బాలకృష్ణ
నాలుగు దశాబ్దాలుగా మాస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. నందమూరి తారకరామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలయ్య.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఓటీటీ ట్రెండ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు హోస్ట్‌గా మారారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో రెండు సీజన్లు ప్రేక్షకుల ఆదరణ పొంది భారీ టీఆర్పీలతో టాప్‌లో నిలిచాయి.
చిరంజీవి
ఇండస్ట్రీలో బ్యాకప్ ఎవరూ లేకుండా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. సినిమాలతోపాటు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న చిరు ఒక పక్క సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వెళ్లారు. అనంతరం రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరిస్తున్నారు. ఇక, హీరోగా వెండితెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా చిరు సందడి చేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తన స్టైల్, నవ్వు, డైలాగ్ డిక్షన్‌తో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించారు చిరు.
నాగార్జున
దాదాపు 30 సంవత్సరాలుగా టాలీవుడ్ మన్మథుడిగా అభిమానులను అలరిస్తున్న నాగార్జున.. ప్రస్తుతం వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంత జోష్‌గా సినిమాల్లో నటించేవారో అదే సరదా, ఎనర్జీతో ఇప్పటికీ ఉంటారు కింగ్ నాగార్జున. తెలుగుతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించిన నాగార్జున.. బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బుల్లితెరపైకి అడుగుపెట్టిన నాగ్.. బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో పాపులర్ కావడానికి నాగార్జున ఇమేజ్ కూడా ప్రధాన కారణం.
జూనియర్ ఎన్టీఆర్
యాక్షన్, మాస్ సినిమాలలో నటిస్తూ యంగ్‌టైగర్‌గా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన నటన, డాన్స్, డైలాగ్స్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్లతో వెండితెరపై నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే తారక్ బుల్లితెరపై కూడా సందడి చేశారు. ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్‌బాస్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను వినోదాన్ని పంచారు జూనియర్ ఎన్టీఆర్.
నాని
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారారు నేచురల్ స్టార్ నాని. నాని కూడా బుల్లి తెరపై కొన్నాళ్లు సందడి చేశారు. బిగ్‌బాస్ సీజన్2కి హోస్ట్‌గా చేశారు. కంటెస్టెంట్లలో జోష్ నింపుతూనే బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు నాని.
రానా దగ్గుబాటి
దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్‌బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చారు రానా. తెలుగు సినిమా వైభవాన్ని దేశవ్యాప్తం చేసిన బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి క్యారెక్టర్లో రానా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. వెండితెరపై హీరోగా, విలన్‌గా చేస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు రానా. వెండితెరపై చేస్తున్న సందడికి తోడు బుల్లితెరపై కూడా అల్లరి చేశారు. నెం.1 యారి అనే షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోలో సెల్రబిటీలతో సరదాసరదా ఆటలతో అలరించారు రానా దగ్గుబాటి.
అలీ
కమెడియన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి ప్రేక్షకులను అలరించిన అలీ.. నిర్మాతగా మారి సినిమాలు కూడా తీశారు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు అలీ. ఇక, కొన్నేళ్లుగా వెండితెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా అలీ తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అలీతో జాలీగా, అలీ 369, అలీతో సరదాగా కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అలీ.
సాయికుమార్
హీరోగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పాపులర్ అయ్యారు సాయి కుమార్. పోలీస్ స్టోరీ సినిమాతో పోలీస్ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా మారిన సాయికుమార్ వెండితెరపై పవర్ఫుల్ క్యారెక్టర్లు ఎన్నో చేసి ప్రేక్షకులను అలరించారు. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే అడపాదడపా వైవిద్యభరితయైన విలన్ పాత్రలను కూడా పోషిస్తున్నారు సాయికుమార్. బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. వావ్ 1, 2, 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన సాయికుమార్ మనం అనే షోకు కూడా హోస్ట్‌గా చేశారు.
టాప్ హీరోయిన్గా రాణిస్తూనే ఆహా వేదికగా సామ్ జామ్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు సమంత రుతుప్రభు. మంచు లక్ష్మి కూడా లక్ష్మీస్ టాక్ షో, మేము సైతం వంటి షోలతో హోస్ట్‌గా అలరించారు. శ్రీనివాస్ అవసరాల, బాలాదిత్య వంటి హీరోలు కూడా బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారే.