ముగ్గురు భార్యల ఓ నిరుద్యోగి కథ
Japan: భర్త సంపాదిస్తే ఇంటి పట్టున ఉండి సంసారాన్ని నడిపే భార్యల గురించే ఇన్నాళ్లూ వింటున్నాం. కానీ పై ఫోటోలోని వ్యక్తిని చూసారా? సాధారణంగా మనకు హౌస్‌వైఫ్ గురించే తెలుసు. కానీ ఇతను హౌస్ హజ్బెండ్. ఎందుకంటే ఇతని భార్యలు సంపాదిస్తుంటే ఇతను మాత్రం పిల్లల్ని కంటూ ఇంటి పట్టునే ఉంటూ సంసారాన్ని చూసుకుంటాడు. ఇప్పటికే ఇతనికి ముగ్గురు భార్యలు, ఇద్దరు ప్రేయసిలు ఉన్నారు. ఇంత మంది ఉన్నా మరో అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఎందుకో తెలియాలంటే.. ముందు ఇతని కథ తెలియాలి.
ఇతని పేరు యూటా. స్వస్థలం జపాన్‌లోని హొక్కైడో. దాదాపు పదేళ్ల నుంచి ఉద్యోగం లేకుండా భార్యల సంపాదనమై ఆధారపడి బతుకుతున్నాడు. ఇలా ఉద్యోగం చేయకుండా ఇంత మందిని పెళ్లి చేసుకుని యూటా ఏం సాధించాలని అనుకుంటున్నాడు? అనేగా మీ డౌట్. ఇతనికి గిన్నీస్ రికార్డుకి ఎక్కాలని ఉందట. అత్యధిక భార్యలున్న వ్యక్తిగా కాదు. అత్యధిక మంది పిల్లల్ని కన్న తండ్రిగా. మీరు విన్నది కరెక్టే. ఇప్పటికే ఇతనికి ముగ్గురు భార్యలతో ముగ్గురు పిల్లల్ని కన్నాడు. మరో 47 మంది పిల్లల్ని కనాలనుకుంటున్నాడట. మొత్తంగా 50 మంది పిల్లలకి తండ్రిగా మారి గాడ్ ఆఫ్ మ్యారేజ్‌గా పేరు పొందాలని యూటా కల. ఈ విషయాన్ని అతనే మీడియా ద్వారా వెల్లడించాడు.
ఇప్పటికైతే యూటా తన ముగ్గురు భార్యలతో ఉంటున్నాడు కాబట్టి మూడు బెడ్‌రూంలు ఉన్న ఇంటిని తీసుకున్నాడు. భార్యలు పెరిగే కొద్ది ఇంటి సైజు కూడా పెరుగుతుంటుంది. కానీ వీరిలో వీరికి ఎలాంటి విభేదాలు లేవు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. కష్టసుఖాలను పంచుకుంటూ ఉంటారు. పదేళ్ల క్రితం యూటా డిప్రెషన్‌తో బాధపడ్డాడు. ఉద్యోగంతో పాటు ప్రేయసిని కూడా కోల్పోవడంతో ఇక తాను మళ్లీ ఉద్యోగం చేయనని… ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారితో పిల్లల్ని కంటూ ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే జపాన్‌లో పాలిగమీ (బహు భార్యత్వం) నిషేధం. మరి యూటా దొరక్కుండా ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలి..!