Elon Musk: ట్రంప్ గెలవకపోతే నా పని గోవింద
Elon Musk: నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాటిక్ నుంచి కమలా హారిస్‌లు పోటీ పడుతున్నారు. టెక్ బిలియనేర్ ఎలాన్ మస్క్ మద్దతు మాత్రం ట్రంప్‌కే ఉంది. ట్రంప్ గెలిస్తే మస్క్‌కి తన కేబినెట్లో సలహాదారు పదవి ఇస్తానని కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే ఒకవేళ ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోతే మాత్రం తన పని గోవింద అని అంటున్నాడు మస్క్. కమలా హారిస్ గెలిస్తే తాను జైలుకి వెళ్లడం ఖాయమని భయపడుతున్నాడు.
జైలుకి వెళ్తానేమో అన్న భయం కంటే తన పిల్లల్ని చూసుకోలేనేమో అనే భయమే ఎక్కువగా ఉందని మస్క్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ ప్రచారాలకు కోట్లల్లో ఖర్చు చేసిన మస్క్ ర్యాలీల్లో పాల్గొంటూ ట్రంప్‌ని గెలిపించాలని కోరుతున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మెట్లు కూడా ఎక్కలేరని.. కానీ ట్రంప్ బుల్లెట్ తగిలినా పిడికిలి బిగించి మరీ ధైర్యంగా పోరాడుతున్నారని అన్నారు. ట్రంప్ ఓడిపోతే ఇక అమెరికాలో ఎన్నికలే జరగవని.. కమలా హారిస్ వలసదారులను లీగల్ చేస్తూ అమెరికా మ్యాప్‌నే మార్చేసే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నాడు. అమెరికా సింగిల్ పార్టీ దేశం కాకుండా ఉండాలంటే ట్రంప్ గెలవడం ముఖ్యమని తెలిపారు.