Donald Trump: నేను గెలిస్తే వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తా
Donald Trump: అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఒకవేళ ఎన్నికల్లో తాను గెలిస్తే అధ్యక్షుడిగా తాను చేసే మొదటి పని అఫ్ఘానిస్థాన్ కారణంగా అమెరికన్ సైనికులు అమరవీరులు కావడానికి కారణమైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడమే అని అన్నారు ట్రంప్. 2021లో ఆగస్ట్ 28న అఫ్గానిస్థాన్‌లోని కాబుల్‌లో ఉన్న హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో 13 అమెరికన్ సైనికులు, వందలాది మంది అఫ్గానీయులు మృతిచెందారు.
అయితే.. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న వెంటనే అమెరికన్ బలగాలను అగ్రరాజ్యం వెనక్కి రప్పించడంలో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఆ దాడి జరిగిందని ట్రంప్ ఆరోపించారు. సరిగ్గా ప్లానింగ్ చేసి ఉంటే అమెరికన్ సైనికులు ఆ దాడిలో మృతిచెందేవారు కారని పైగా ఆ దాడిలో ఏ ఒక్క అమెరికన్ సైనికుడు మృతిచెందలేదని బైడెన్ అబద్ధపు ఆరోపణలు చేసారని మండిపడ్డారు. ఆ దాడి సమయంలో అమెరికన్ సైన్యానికి సంబంధించి ఎవరైతే అధికారిక నిర్ణయాలు తీసుకున్నారో వారందరినీ తాను అధ్యక్ష పదవిలోకి వచ్చాక పీకి పారేస్తానని హెచ్చరించారు. ఈ నిర్ణయం వెనుక తన హస్తం కూడా ఉందని అప్పటి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నారని ట్రంప్ గుర్తుచేసారు.