Female Trump Supporter: ఎవ‌ర‌క్కా నువ్వు ఇలా త‌గులుకున్నావేంటి?

Female Trump Supporter: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో (us elections) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రిప‌బ్లికన్ అభ్య‌ర్ధిగా ట్రంప్ ఈ ఎన్నిక‌ల్లో డెమోక్రాటిక్ లీడ‌ర్ అయిన క‌మ‌లా హ్యారిస్‌పై (Kamala harris) పోటీ చేస్తున్నారు. ఇద్ద‌రికీ మ‌ద్ద‌తుదారులు బాగానే ఉన్నారు. పైగా త‌న‌కు ఆడ‌వాళ్ల మ‌ద్ద‌తు బాగా ఉంద‌ని ట్రంప్ ఇటీవ‌ల వెల్ల‌డించారు. అయితే ట్రంప్‌కి మ‌ద్ద‌తు తెలుపుతున్న ఓ మ‌హిళ వ‌ల్ల ఆయ‌న త‌ల‌ప‌ట్టుకోవాల్సి వ‌స్తోంది.

ఎందుకంటే.. అభ్య‌ర్ధి ఎంత మంచివాడైనా ప‌క్క‌న ఉండే మ‌ద్ద‌తుదారుల ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టి ఆ అభ్య‌ర్ధికి ఓటెయ్యాలా వ‌ద్దా అనేది నిర్ణయిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు.. మ‌న తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల‌నే తీసుకుందాం. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో రోజూ ఏదో ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది. అయితే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఎంత మంచివారైనా వారి పార్టీల్లో ఉండే నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అవినీతికి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటే వారికి కూడా ఆ బుర‌ద అంటుకుంటుంది. ఇప్పుడు ట్రంప్ ప‌రిస్థితి కూడా ఇదే.

అస‌లేం జ‌రిగింది?

Female Trump Supporter: లౌరా లూమ‌ర్ (Laura Loomer). ఈ పేరు వింటేనే ట్రంప్‌కి ఆయ‌న మ‌ద్ద‌తుదారుల‌కు గుండె గుభేలుమంటోంది. లౌరాకి ట్రంప్ అంటే విప‌రీత‌మైన అభిమానం. కానీ ఆ అభిమానం ట్రంప్‌కి సంక‌టంలా మారుతోంది. ఇందుకు కార‌ణం లౌరా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇస్తూ సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద పోస్ట్‌లు, కామెంట్స్ చేయ‌డ‌మే. లౌరా లూమ‌ర్ 31 ఏళ్ల సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్. స్వ‌యం ప్ర‌క‌టిన ఇన్‌వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ కూడా. అరిజోనాలో పుట్టిన జూయిష్ అమెరిక‌న్. అంటే స‌గం జూదులు స‌గం అమెరిక‌న్ కుటుంబానికి చెందిన పిల్ల‌.

లౌరాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్నారు. ముస్లింలు, వ‌ల‌స‌దారులు, ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన‌వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలో లౌరా పాపుల‌ర్. ముందు వెనకా ఆలోచించ‌కుండా ఎలా ప‌డితే అలా కామెంట్స్ పెట్టేస్తుంది. ఓసారి ఇస్లాం మ‌తాన్ని ప‌ట్టుకుని అదొక క్యాన్స‌ర్ అని కామెంట్ చేసింది. ఎన్నో జాతివివ‌క్ష అభ్యంత‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. లౌరా ఇంత‌టితో ఆగ‌లేదు. ట్రంప్ ప్ర‌త్య‌ర్ధి అయిన క‌మ‌లా హ్యారిస్‌పై కూడా కామెంట్ చేసింది. ఒక‌వేళ హ్యారిస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిస్తే వైట్ హౌస్ మొత్తం ఇండియ‌న్ క‌ర్రీ వాస‌న వ‌స్తుంద‌ని కామెంట్ చేసింది. అంటే ఆమె భార‌తీయుల వైపే మొగ్గు చూపుతూ అమెరికా గురించి ప‌ట్టించుకోద‌ని ఆ కామెంట్ అర్థం. మ‌రి ఇలాంటి అమ్మాయి ఒక అధ్య‌క్ష అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తు తెలుపుతోందంటే ఎవ‌రికైనా త‌ల‌నొప్పే.

ఇప్పుడు ట్రంప్‌కి అమెరిక‌న్ల మ‌ద్ద‌తు ఎంతో అవ‌స‌రం. కానీ లౌరా చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వ‌ల్ల ట్రంప్‌కు ప‌డే ఓట్ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న ప్ర‌చార‌క‌ర్త‌లు భ‌య‌ప‌డుతున్నారు. దాంతో లౌరాకు దూరంగా ఉండాల‌ని వారు ట్రంప్‌ను హెచ్చ‌రించారు. దీనిపై ట్రంప్ స్పందించారు. లౌరా త‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని.. కానీ ఆమెను ఇలా మాట్లాడ‌ద్దు అలా మాట్లాడ‌ద్దు అని త‌న భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించే హ‌క్కు త‌న‌కు లేద‌ని అన్నారు. ఇక లౌరా ఏమంటోందంటే.. తాను ట్రంప్ స‌ల‌హాదారు కాద‌ని.. కాబ్టి ఆయ‌న త‌న విష‌యంలో భ‌య‌ప‌డాల్సింది లేద‌ని అంటోంది. ఎవరు ఏమ‌నుకున్నా ట్రంప్‌కే త‌న మ‌ద్ద‌తు తెలుపుతాన‌ని.. ఆయ‌న గెల‌వ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని న‌డుం బిగించి మ‌రీ ప్ర‌చారాల్లో పాల్గొంటోంది.