Donald Trump: ట్రంప్‌ని చంపాలనుకున్న ఈ వ్యక్తి ఎవరు?
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల (USA Elections) బరిలో రిపబ్లికన్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం ఫ్లోరిడాలో ట్రంప్‌కి చెందిన గోల్ఫ్ కోర్స్‌లో నిందితుడు కాల్పులకు పాల్పడాలనుకున్నాడు. ట్రంప్ ఆవరణలోనే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిందితుడిని గమనించి కాల్పులు జరిపారు. అతను తప్పించుకుని ఓ నల్లటి కారులో పారిపోయేందుకు యత్నించాడు. దాంతో ఆ ఏజెంట్లు వెంటనే కారును వెంబడించి మరీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లక్కీగా ఈసారి మాత్రం ట్రంప్‌పై ఎలాంటి కాల్పులు జరగలేదు.
నిందితుడు ఎవరు?
నిందితుడి పేరు రయాన్ వెస్లీ రౌత్‌గా (ryan wesley routh) పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇతని వయసు 58 ఏళ్లు. సంఘటనా స్థలంలో AK-47 లాంటి రైఫిల్, బైనాక్యులర్, గోప్రో కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రయాన్ రౌత్ అనే వ్యక్తి నార్త్ కెరోలినా గ్రీన్స్ బరో అనే ప్రాంతానికి చెందిన కన్స్ట్రక్షన్ వర్కర్. అందరూ అనుమానించినట్లు రయాన్ ఎలాంటి మిలిటరీ నేపథ్యానికి చెందిన వ్యక్తి కాదు. కాకపోతే అతనికి ఉక్రెయిన్ కోసం యుద్ధంలో పోరాడి చనిపోవాలని కోరికట. ఈ విషయాన్ని అతను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సాధారణ ప్రజలు ఒక్కటిగా ఉండి భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలకు తావివ్వకుండా చేయాలని పిలుపునిచ్చాడు. అప్పుడే మానవ హక్కులను కాపాడుకున్నవాళ్లం అవుతామని.. ప్రతి ఒక్కరూ ఇతరులకు తోచినంత సాయం చేస్తే ప్రపంచం బాగుపడుతుందని సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో రాసుకున్నాడు. రయాన్ ఆన్లైన్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు 2023లో ఓ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌కి వెళ్లి అక్కడ అఫ్ఘాన్ సైనికులను నియమించుకుని మరీ యుద్ధం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో చాలా మంది అతను యుద్ధాలకు వ్యతిరేకని.. మంచి మనిషి అని అనుకున్నారే తప్ప ఇలా ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు జరిపేంతలా బరితెగిస్తారని అనుకోలేదు.
ట్రంప్‌పై ఎందుకు కోపం?
ఇంతకీ రయాన్‌కు ట్రంప్‌పై ఎందుకు చంపేంత కోపం వచ్చిందంటే.. ఇప్పటికీ ట్రంప్ తన మిత్రుడైన రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు (Vladimir putin) మద్దతు తెలుపుతున్నారు. కావాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచాక పుతిన్‌కు తాను ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడవద్దు అని నచ్చజెప్తానని ఇటీవల జరిగిన డిబేట్లో వెల్లడించారు. అప్పుడు ట్రంప్ ప్రత్యర్ధి, డెమోక్రాటిక్ పార్టీ లీడర్ అయిన కమలా హ్యారిస్ (kamala harris) స్పందిస్తూ.. నిన్ను పుతిన్ డిన్నర్లో నమిలి మింగేస్తాడు చూస్కో అని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ట్రంప్ అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ మిగలదని భావించిన నిందితుడు రయాన్ ట్రంప్‌ని లేపేస్తే పీడపోతుందని భావించాడు.
వరుసగా రెండో ఘటన
నెల రోజుల క్రితం ట్రంప్ పెన్సిల్వేనియాలో తన మద్దతుదారులతో సమావేశం అవుతుండగా ఓ యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. లక్కీగా ట్రంప్ తల పక్కకు తిప్పడంతో బుల్లెట్ చెవికి తాకింది. వెంటనే నిందితుడిపై సీక్రెట్ ఏజెంట్ అధికారులు అక్కడికక్కడే కాల్పులు జరిపి చంపేసారు.
ట్రంప్‌పై మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి?
ట్రంప్‌పై రెండోసారి దాడి జరిగిన నేపథ్యంలో అమెరికన్ బిలియనేర్ ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. ఒకే నెలలో రెండు సార్లు ట్రంప్‌పై మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయ్ అని ఆయన ట్వీట్ చేసారు.