Russia: నిప్పుతో చెలగాటమా? సాయం చేసారో మూడో ప్రపంచ యుద్ధమే
Russia: రష్యా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ రష్యాపై రష్యా ఉక్రెయిన్‌పై పరస్పర దాడులు చేసుకుంటున్న తరుణంలో అమెరికాతో పాటు ఇతర పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల విషయంలో సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా పశ్చిమ దేశాలకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. రష్యాపై దాడి చేస్తున్న ఉక్రెయిన్‌కు ఆయుధాల సాయం చేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. మూడో ప్రపంచ యుద్ధం మొదలుపెడితే అది యూరప్‌ను కూడా దాటి పోతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్ హెచ్చరించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల విషయంలో సాయం చేస్తే మాత్రం రష్యా తమ క్షిపణులను వాడేందుకు కూడా వెనకాడదని అన్నారు.
విదేశీ ఆయుదాలపై ఉన్న నిబంధనల్లో ఉక్రెయిన్ సడలింపులు కోరుతోందని.. అలాగని ఉక్రెయిన్‌కు ఏ పశ్చిమ దేశాలైనా సాయం చేస్తే.. ముఖ్యంగా అమెరికా సాయం చేస్తే అది నిప్పుతో చెలగాటమే అవుతుందని మండిపడ్డారు. ఆగస్ట్ 6న ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ అనే ప్రాంతంపై దాడి చేసింది. రష్యా సైనికులు కాఫీ తాగుతూ సేదతీరుతుండగా ఉన్నట్టుండి ఉక్రెయిన్ వారిపై కాల్పులకు పాల్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా గడ్డపై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి.
కుర్స్క్ దాడిలో ఉక్రెయిన్ అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించినట్లు అంగీకరించినప్పటికీ తాము పాశ్చాత్య మిత్రదేశాల విధించిన పరిమితులను పాటిస్తున్నామని పేర్కొంది. అయితే, రష్యాకు ఈ విషయంలో అనుమానం ఉంది. అమెరికా ఈ దాడిలో భాగస్వామిగా ఉందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా, బ్రిటన్ అందించిన ఉపగ్రహ చిత్రాల వంటి సాక్ష్యాలను రష్యా ఆధారాలుగా చూపించింది. దీనిపై అమెరికా స్పందిస్తూ.. ఉక్రెయిన్ రష్యాపై దాడి చేస్తుందని తమకు ముందస్తు సమాచారం కూడా లేదని.. తాము డైరెక్ట్‌గా ఈ ఆపరేషన్‌లో పాల్గొనలేదని తెలిపింది.