SC Sub Classification: ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి.. లాభ, నష్టాలు ఎవరికి?

what is sc sub classification

SC Sub Classification: భార‌త‌దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై కీల‌క తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ఏంటీ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ‌ల్ల ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం?

2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఎస్సీ జ‌నాభా కోటి 38 ల‌క్ష‌ల 78 వేలు. వీరిలో మాదిగ‌లు 67,2619 కాగా.. మాల‌లు 58,70244 మంది. అంటే మాదిగ జ‌నాభా మాల‌ల కంటే ఎక్కువ‌. మొత్తం ఎస్సీ జ‌నాభాలో రెండు కులాల జ‌నాభానే 80% వ‌ర‌కు ఉండ‌చ్చ‌ని అంచ‌నా. మిగ‌తా 57 కులాల్లో పెద్ద సంఖ్య వెల్లి కులానిది. అయితే.. ఈ కులాల‌న్నీ కూడా ఊర్ల‌లో నివ‌సిస్తున్న‌వారే. ఒక‌ప్ప‌టి రోజుల్లో తీవ్ర అణ‌చివేత‌కు గుర‌వ‌డం.. అంట‌రానిత‌రాన్ని వివ‌క్ష‌ను ఎదుర్కొన్నాయి. ఎస్సీలో కూడా ఎక్కువ త‌క్కువ‌లు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు మాదిగ‌ల‌ను మాల‌లు త‌క్కువ‌గా చూస్తారు.

మాదిగ‌లు అధికంగా ఉండ‌టంతో స్వాతంత్రం వచ్చిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు విద్యా, ఉద్యోగ‌, రాజ‌కీయ‌, సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జ‌రుగుతూ వ‌స్తోంద‌ని అప్ప‌ట్లో కొంద‌రు మేధావులు గ్ర‌హించారు. మాదిగ‌ల జ‌నాభా ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ అన్ని అంశాల్లో వెనుక‌బ‌డి ఉన్నార‌ని అభిప్రాయ‌పడ్డారు. 70 శాతం మంది ఉన్న మాదిగ కులాలు 10 శాతం రిజ‌ర్వేష‌న్ ప్ర‌యోజ‌నాలు పొందుతుంటే 30శాతం ఉన్న మాల‌ల‌కు 90 శాతం రిజ‌ర్వేష‌న్ అందుతోంద‌ని వారు ఆరోపిస్తున్నారు.

అన‌గారిన వ‌ర్గాలు ఎక్కువ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అప్ప‌ట్లో చాలా ఉద్య‌మాలు పుట్టుకొచ్చాయి. అందులో మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి ప్ర‌ధాన‌మైన‌ది. మంద కృష్ణ మాదిగ దీనిని స్థాపించారు. ఈ ఉద్య‌మాన్ని ఆయ‌న 1994లో మొద‌లు పెట్టి మాదిగ‌ల హ‌క్కుల కోసం పోరాటానికి నాంది ప‌లికారు. పాద‌యాత్ర చేస్తూ అన్ని రంగాల్లో మాదిగ‌ల‌కు ద‌క్కాల్సిన వాటా ద‌క్కాల్సిందేనంటూ మాదిగ‌ల‌ను చైత‌న్య ప‌రిచారు. ఈ నేప‌థ్యంలోనే ఎస్సీ కులాల‌ను ఏ, బి, సి, డి గ్రూప్‌లుగా విభ‌జించి ఆయా కులాల నిష్ప‌త్తి ప్ర‌కారం 15 శాతం రిజర్వేష‌న్ కోటాను పెంచాల‌ని డిమాండ్ చేసారు.

బీసీలో ఉన్న ఏ, బి, సి, డి వ‌ర్గాల మాదిరిగానే ఎస్సీల‌కు కూడా ఏ, బి, సి, డి గ్రూప్‌లుగా వ‌ర్గీక‌రించి అన్ని ర‌కాలుగా న‌ష్టపోతున్న మాదిగ‌ల‌కు న్యాయం చేయాల‌ని మంద కృష్ణ మాదిగ కోరారు. ఆయ‌న ఈ ఒక్క ఉద్య‌మంతో స‌రిపెట్ట‌లేదు. 1994 నుంచి మొద‌లుకుని మారిన ప్ర‌తి సీఎం వ‌ద్ద‌కు వెళ్లి త‌న గోడును వినిపించేవారు. చివ‌రికి సుప్రీంకోర్టు తీర్పుతో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు.

2000 నుంచి 2004 వ‌ర‌కు అప్ప‌టి చంద్ర‌బాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌ను అమ‌లు చేసింది. అయితే మాల మాహానాడు వ‌ర్గీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించింది. హైకోర్టులో న్యాయ‌పోరాటం చేసింది. కోర్టు వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా తీర్పు నిచ్చింది. దాంతో 2004లో నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను వ్య‌తిరేకించింది. వివ‌క్ష వెనుక‌బ‌డిన వారిని ఒకే కేట‌గిరీలో ఉంచాల‌ని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. అప్ప‌టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాటాలు ప్ర‌జా ఉద్య‌మాలుగానూ రాజ‌కీయ ఉద్య‌మాలుగానూ జ‌రుగుతూ వ‌చ్చాయి. చివ‌రికి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది.

వ‌ర్గీక‌ర‌ణ‌ల‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయ‌మూర్తులు ఉన్న ధ‌ర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. వ‌ర్గీక‌ర‌ణ‌పై ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అధికారాన్ని క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య‌, వైద్య రిజ‌ర్వేష‌న్ కోసం ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ అనివార్యం అని చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం 6:1 నిష్ప‌త్తిలో తుది తీర్పును వెల్ల‌డించింది. కోర్టు తీర్పును ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సైతం స్వాగ‌తించారు.

ఇక్క‌డితో స‌మ‌స్య తీరిపోయిన‌ట్లు కాదు అనేది నిపుణుల మాట‌. కోర్టు చ‌రిత్రాత్మ‌క తీర్పుతో పోరాటం ముగించింది కానీ పోరాట ల‌క్ష్యం నెర‌వేరుతుందా అనేది అస‌లు ప్ర‌శ్న‌. ప్ర‌భుత్వ రంగం ఉండి రిజ‌ర్వేష‌న్‌ను స‌రిగ్గా అమ‌లు చేస్తే 16 శాతం మంది మాత్ర‌మే ప్ర‌యోజ‌నం పొందుతారు. మిగ‌తా 84 శాతం మంది అసాంఘిక‌ రంగాల్లో జీవ‌నోపాధి పొందాల్సి ఉంటుంది. రిజ‌ర్వేష‌న్ కార‌ణంగా 2 నుంచి 3 శాత‌మే ఇప్ప‌టికి అభివృద్ధి చెందార‌ని గణాంకాలు చెప్తున్నాయి. మిగ‌తా 97 శాతం ఇంకా అభివృద్ధి చెందాల్సిన స్థితిలోనే ఉన్నాయి. మాల‌, మాదిగ ఉప కులాల‌లోని రెండు కులాలలో అభివృద్ధి చెందిన‌వారు ఉన్నారు.

మాదిగ‌ల డిమాండ్ ఏ, బి, సి, డి ఫార్ములా బీసీ ఉప కులాల విష‌యంలో వైఫ‌ల్యం చెందింది కాబ‌ట్టి అత్యంత వెనుక‌బ‌డిన వ‌ర్గం పుట్టింద‌ని మేధావులు గుర్తుచేస్తున్నారు. మ‌రి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంటి? అభివృద్ధి చెంద‌ని వారిని మొద‌టి ల‌బ్ధిదారుగా.. అభివృద్ధి చెందిన‌వారిని ద్వితీయ ల‌బ్ధిదారుగా మారిస్తే ఇది సాధ్యం అవుతుంది.