Lifestyle: మగాడు లేకుండా ఎలా బతుకుతావ్ అని కామెంట్స్ చేస్తున్నారు
Lifestyle: నా వయసు 33. కెరీర్ పరంగా ఉన్నత హోదాలో ఉన్నా. సొంత ఇల్లు ఉంది. కానీ నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. నావి రెండు మూడు రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాయి. దాంతో నాలుగేళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. నాకు ఈ విషయం పట్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా ఆఫీస్‌లో కొలీగ్స్ ఈ విషయంలో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మగాడు లేకుండా ఎలా ఉంటావు ఎందుకు నీ కోరికలు చంపుకుంటావు అంటూ వ్యక్తిగత అంశాలపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇది నేను భరించలేకపోతున్నాను. ఈ విషయం నేను హెచ్ఆర్కు కూడా చెప్పుకోలేని పరిస్థితి. తెలిస్తే కంపెనీలో నా పరువు పోతుందని భయంగా ఉంది. ఏం చేయాలో అర్ధంకావడంలేదు. ఏదన్నా సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా
వృత్తిరిత్యా మంచి హోదాలో ఉన్నందుకు అభినందనలు. ఇక మీ వ్యక్తిగత విషయానికొస్తే.. మీకు అసలు పెళ్లి చేసుకునే యోచన ఉందా? లేక మీ గతాన్ని గుర్తుచేసుకుంటూ అసలు పెళ్లే చేసుకోకూడదు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మీరు నాకు చెప్పనక్కర్లేదు. మీకు మీరు చెప్పుకోండి. ఒకవేళ మీకు అసలు పెళ్లే చేసుకోవాలని లేదు అంటే మీ కొలీగ్స్‌కి ఈ విషయం చెప్పి ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురావద్దు అని ముఖం మీద చెప్పేయండి. అలా కాకుండా వాళ్లేదో మీపై కామెంట్స్ చేస్తున్నారని మీరు ఇప్పటికిప్పుడు ఓ అబ్బాయిని వెత్తుకోవడం వంటి నిర్ణయాలు తీసుకోకండి.
మనం సమాజం కోసం బతకడంలేదు అనేది గుర్తుంచుకోండి. ఇక మీ కొలీగ్స్ నోరుమూయించేందుకు ఒకసారి వారితో కూర్చుని ఆఫీస్‌లో కంపెనీకి మంచి ఎలా చేయాలో ఆలోచిస్తే చాలు నా గురించి అవసరం లేదు అని కరాకండిగా చెప్పేయండి. అయినా వినకపోతే మీరు హెచ్ఆర్కి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మధ్య పాష్ (POSH) ప్రోగ్రామ్స్‌లో భాగంగా కంపెనీలు ఇలాంటి అంశాలను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. మీరు పాష్ ద్వారా హెచ్ఆర్ వద్దకు వెళ్తే వారే చూసుకుంటారు. ఆల్ ది బెస్ట్.