సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సెటైర్లు!
హైదరాబాద్‌లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశాని… ఆయన కోసం ఓ కుర్చి కూడా కేటాయించామన్నారు. సీఎం కేసీఆర్ వస్తే శాలువా కప్పి ప్రధాని మోదీ చేతులమీదుగా సన్మానం కూడా చేయించేవాడినని సెటైర్లు విసిరారు. మరి ఎందుకు రాకుండా డుమ్మా కొట్టిండో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఆటంకం అని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావడానికి దేశ ప్రధాని, రైల్వే మినిస్టర్‌తో బీజేపీ పార్టీ నాయకులంతా హాజరయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదని చెప్పుకొచ్చారు. దీనికి జ్వరం వచ్చిందని అంటారా.? కోవిడ్ వచ్చిందని అంటారా? అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏంటని, నేటి సీఎం షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని బండి ఆరోపించారు.