“నన్ను ఓదార్చే నా మొసలి తప్పిపోయింది.. కనిపిస్తే కాస్త చెప్పండయ్యా”
Viral News: మూగ జీవులకు మనుషులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. సాటి మనిషితో పంచుకోలేని కొన్ని బాధలను వారు తాము పెంచుకుంటున్న జంతువులతో చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటూ వాటితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా మొసలిని పెంచుతూ తన బాధలను ఆ మొసలితో చెప్పుకుంటున్నాడట. విచిత్రం ఏంటంటే.. ఆ మొసలి అతని బాధలన్నీ విని ఓదారుస్తూ ఉంటుందట.
ఇప్పుడు సమస్య ఏంటంటే.. తనను ప్రేమగా ఓదార్చే ఆ మొసలి కనిపించకుండాపోయింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. జోయీ అనే వ్యక్తి దాదాపు పదేళ్లుగా ఓ మొసలిని పెంచుకుంటున్నాడు. ఆ మొసలి వల్ల అతను డిప్రెషన్ నుంచి కూడా బయటపడ్డాడట. అయితే కొంతకాలంగా ఆ మొసలి కనిపించకుండాపోయిందట. ఇటీవల జోయీ ఆ మొసలితో పాటు జార్జియాలోని బ్రున్స్‌విక్ అనే ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. తన మొసలి అక్కడే తప్పిపోయిందట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడిస్తూ దయచేసి దాని ఆచూకీ తెలిస్తే చెప్పండి అని వేడుకుంటున్నాడు. అయితే.. జార్జియాలో మొసళ్లను పెంచుకోవడానికి అనుమతి లేదు. ఒకవేళ జనాలు నివసించే ప్రదేశాల్లో మొసలి ఉన్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. పాపం జోయీ బాధను ఎవరు తీరుస్తారో ఏంటో..!