రిలీజ్‌ రోజే ఫైబర్‌నెట్‌లో కొత్త సినిమా చూడొచ్చు!

ఏపీ ఫైబర్‌ నెట్‌ వినియోగదారులకు శుభవార్త.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజునే ఏపీ ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నామని.. పెద్ద హీరోలకు, నిర్మాతలకు తాము వ్యతిరేకం కాదని.. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ప్రకారం సినిమాను విడుదల చేస్తామన్నారు. ఎల్‌పీటీ ద్వారా విడుదల చేస్తున్నందున పైరసీకి తావుండదని ఆయన అన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయ్యిందని.. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుందని తెలిపారు. అయితే అది ప్రస్తుతం చిన్న సినిమాలను తీసుకునే ఆలోచనలో ఫైబర్‌ నెట్‌ నిర్వాహకులు ఉండగా.. పెద్ద హీరోలు, నిర్మాతలు ముందుకు వస్తే వారి సినిమాలను విడుదల చేస్తామని అంటున్నారు.

ఏపీఎల్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్ బాగా నచ్చిందని… చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్ లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. ‘ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము. పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్లో రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను’ అని ఆయన తెలిపారు.

అనంతరం నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం, పోసాని అలీ వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్ లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు సీఎం జగన్ ఇచ్చిన వరం అని కొనియాడారు. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈ రోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్ఫామ్ అని ఆయన పేర్కొన్నారు.