Suman: ఒక హీరో సీఎం అవ్వ‌డం చాలా క‌ష్టం

Suman: సినిమా నుంచి వచ్చిన వాళ్లు ముఖ్య‌మంత్రి అవ్వ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అన్నారు సినీ న‌టుడు సుమ‌న్. సీనియ‌ర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జ‌య‌ల‌లిత‌ల త‌ర్వాత సినిమా వాళ్లు ఎవ్వ‌రూ కూడా సీఎం కాలేక‌పోయార‌ని ఇప్పుడు ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చింద‌ని తెలిపారు. ప‌రోక్షంగా ఆయ‌న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌స్తావించారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే సినిమా వాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తారు కానీ ముఖ్య‌మంత్రి అవ్వాలంటే రాజ‌యోగం ఉండాల‌ని అన్నారు. ఇప్పుడు ప్ర‌జ‌లు ఆలోచించాల్సింది ముఖ్య‌మంత్రి ఎవ‌రు అయితే బాగుంటుంద‌ని కాద‌ని.. వారు ఉంటున్న ప్రాంతాల్లో లోకల్ లీడ‌ర్ల‌లో ఎవ‌రు సాయం చేస్తున్నారో చూసుకుని వారికి ఓటేసి గెలిపించుకుంటే చాల‌ని.. ఎందుకంటే ఏద‌న్నా స‌మ‌స్య వ‌స్తే నేరుగా ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌రికి వెళ్తానంటే కుద‌ర‌ద‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా లోక‌ల్ నాయ‌కుల వ‌ద్ద‌కే వెళ్తాం కాబ‌ట్టి వారిలో మంచివారిని ఎన్నుకోవాల‌ని తెలిపారు.

ఇప్పుడు ఉన్న పార్టీలో కులాలు, మ‌తాలకు అతీతంగా పోరాడుతూ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటు ప‌డుతున్న పార్టీలు ఏవైనా ఉన్నాయంటే క‌మ్యునిస్ట్ పార్టీలు మాత్ర‌మే అని.. మిగ‌తా పార్టీల్లోని నేత‌లు ప‌ద‌వి, డ‌బ్బు కోసం ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి జంప్ అవుతున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రేపు ఎన్నిక‌ల త‌ర్వాత ఏ పార్టీ గెలిస్తే మిగ‌తా పార్టీల నేత‌లు గెలిచిన పార్టీలోకి క‌చ్చితంగా జంప్ అవుతార‌ని అన్నారు.