భ‌ర్త‌లు జైల్లో.. భార్య‌లు జ‌నాల్లో..!

Nara Bhuvaneswari: రాజ‌కీయాలంటే మామూలు విష‌యం కాదు. ఎప్పుడు ఏ ప్ర‌మాదం ముంచుకొస్తుందో తెలీదు. అన్నింటికీ తెగించే ఈ ఊబిలోకి దిగాల్సి ఉంటుంది. కుటుంబం నుంచి ఒక‌రు రాజ‌కీయాల్లోకి దిగారంటే ఆ కుటుంబం మొత్తం అందులో మునిగాల్సిందే. భ‌ర్త‌లు రాజ‌కీయాల్లో ఉంటూ వారికి ఏద‌న్నా స‌మ‌స్య వ‌స్తే.. అస‌లు రాజ‌కీయాలంటే ఏంటో తెలీని భార్య‌లు వారి కోసం జ‌నాల్లోకి వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఇటీవ‌ల

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్ట్ అవ్వ‌గా.. ఆయ‌న స‌తీమ‌ణి సునీతా కేజ్రీవాల్ (Sunitha Kejriwal) రంగంలోకి దిగారు. నా భ‌ర్త సింహం లాంటివారు… ఆయ‌న ఈ కేసుల‌కు అరెస్ట్‌ల‌కు భ‌య‌ప‌డ‌రు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌ల‌తో క‌లిసి ధ‌ర్నాలు, స‌మావేశాల్లో పాల్గొంటున్నారు. అస‌లు రాజ‌కీయాలంటే ఏంటో కూడా తెలీని ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు అండ‌గా నిలుస్తున్నారు. ఇప్పుడంటే సునీతా కేజ్రీవాల్ వార్త‌ల్లో నిలిచి వైర‌ల్ అయ్యారు కానీ.. గ‌తంలో కూడా మాజీ ముఖ్య‌మంత్రుల భార్య‌లు త‌మ భ‌ర్త‌ల కోసం జ‌నాల్లో తిరిగిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. వారెవరంటే..

నారా భువ‌నేశ్వ‌రి

తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కూడా త‌న భ‌ర్త కోసం మొట్ట మొద‌టిసారి జ‌నాల్లోకి వచ్చారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో భాగంగా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయ్యి దాదాపు 50 రోజుల పాటు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడు లేని స‌మ‌యంలో ఆయ‌న లేని లోటు తీర్చేందుకు నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు.

త‌న భ‌ర్త ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ప్ర‌చారం చేస్తూ జ‌నాల్లో తిరిగారు. రాజ‌కీయ నేత‌గా ప్ర‌సంగించ‌డం రాక‌పోయినా ఏదో ఒక రకంగా త‌న బాధ‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు బెయిల్‌పై బ‌య‌ట ఉన్నా కూడా.. నిజం గెల‌వాలి యాత్ర‌లో భాగంగా ఇంటింటా తిరిగి ప్ర‌చారం చేస్తూ భ‌ర్త‌కు అండ‌గా నిలుస్తున్నారు.

ర‌బ్రీ దేవి

బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ (Lalu Prasad Yadav) స‌తీమ‌ణి ర‌బ్రి దేవి (Rabri Devi) కూడా ఈ కోవ‌కు చెందిన‌వారే. ఫాడ‌ర్ (తౌడు) స్కాం నేపథ్యంలో 1997లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దాంతో కేసులో ఇరుక్కున్న వ్య‌క్తి రాష్ట్రానికి సీఎంగా ఎలా ఉంటారు అని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేయ‌డంతో లాలూ రాజీనామా చేసారు. దాంతో ఆయ‌న భార్య ర‌బ్రి దేవి బిహార్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. బిహార్‌కు తొలి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టింది కూడా ర‌బ్రి దేవే. 2005 వ‌ర‌కు ఆమే రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు.