Mayank Yadav: జెట్ విమానాలను చూసి.. జెట్ స్పీడ్‌లో బౌలింగ్ చేసి..!
Mayank Yadav: ఇప్పుడు లఖ్నౌ సూపర్ జైంట్స్ (Lucknow Super Giants) అనగానే అందరికీ మాయంక్ యాదవే గుర్తొస్తాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో మాయంక్ సృష్టించిన విధ్వంసం అలాంటిది. 21 ఏళ్ల ఈ కుర్రాడు సీనియర్లనే బెంబేలెత్తించాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో 155.8 స్పీడ్‌తో బాల్ వేసి ఐపీఎల్‌లోనే రికార్డ్ సృష్టించాడు. 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మాయంక్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.
మాయంక్‌కు చిన్నప్పటి నుంచి జెట్ విమానాలు, వేగంగా వెళ్లే బైకులు, రాకెట్లు ఎంతో ఇష్టమట. అవి వెళ్తున్నప్పుడు వాటినే చూస్తూ ఎంత స్పీడుగా వెళ్తున్నాయో అనుకునేవాడట. క్రికెటే కాకుండా చిన్నప్పటి నుంచి వేగంగా వెళ్లే వాహనాలంటే కూడా ఎంతో ఇష్టమని… అసలు వేగం అంటేనే తనకు ఏదో తెలీని థ్రిల్‌ని ఇస్తుందని అంటున్నాడు మాయంక్. ఇప్పుడు అదే వేగం తన బౌలింగ్‌లో చూపించానని పేర్కొన్నాడు. అలా నిన్నటి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయాడు.
2022లోనే మాయంక్ ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. అప్పట్లో లఖ్నౌ సూపర్ జైంట్స్ ఇతన్ని దాదాపు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆడేందుకు మాత్రం అవకాశం రాలేదు. ఇప్పుడు రాక రాక అవకాశం రావడంతో దుమ్ము దులిపేస్తున్నాడు ఈ థండర్‌బోల్డ్ కుర్రాడు.