జీతం కోటి రూపాయలు.. నో వర్క్!
సంవత్సరానికి కోటి రూపాయల జీతం.. అసలు పనే ఉండదు.. ఆహా వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది కదూ..! ఇలాంటివన్నీ సినిమాల్లోనో కలల్లోనో జరుగుతాయనుకోండి. కాకపోతే.. అమెరికాకు చెందిన ఓ యువతికి మాత్రం ఈ అదృష్టం దక్కింది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదివేయండి.
అమెరికాకు చెందిన మ్యాడీ అనే యువతి గతేడాది జనవరిలో ప్రముఖ సంస్థ ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటాలో ఉద్యోగం సంపాదించింది. ప్యాకేజ్ సంవత్సరానికి కోటిన్నర. ఇంతకంటే ఏం కావాలి అని వెంటనే జాయిన్ అయిపోయింది. అయితే మ్యాడీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అసలు పనే ఉండటం లేదట. కానీ రోజులో ఓ పది సార్లు మాత్రం మీటింగులు జరుగుతుండేవట. ఆఫీస్‌కి వెళ్లడం మీటింగులు అటెండ్ అవ్వడం తప్ప అసలు పనే లేదట. ఆ మీటింగుల్లో కూడా ఏదైనా వర్క్ గురించి మాట్లాడుకుంటారా అంటే.. వేరే సంస్థలు మరో ఆరు నెలల పాటు ఎవర్నీ ఎంపికచేసుకోవట అనే విషయం గురించే మాట్లాడుకునేవారట. అలా మ్యాడీ మెటాలో జీతం తీసుకుంటూ ఆరు నెలలు గడిపేసింది. అయితే మ్యాడీ టిక్‌టాక్ స్టార్ కూడా కావడంతో ఆఫీస్‌లో ఏం జరుగుతుండేవో టిక్‌టాక్ వీడియోల్లో చెప్పేదట. అలా ఆమె చేస్తున్న వీడియోలు మెటా సంస్థ కంటపడ్డాయి. దాంతో ఆమెను ఉద్యోగం నుంచి తీసేయాలనుకున్నారు. తాను ఆ వీడియోలు చేయడం మానేసానని చెప్పినా సంస్థ యాజమాన్యం వినలేదట. అలా ఇటీవల జరిగిన లే ఆఫ్‌లో మ్యాడీ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లు టిక్‌టాక్ వీడియో ద్వారా చెప్పింది.