BCCI: టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్.. !
BCCI: వన్డేలు, టీ20ల రాకతో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుంది. కొందరు ఆటగాళ్లు సైతం వివిధ దేశాల్లో నిర్వహించే టీ20 లీగులు ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు గానీ టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇష్టపడడం లేదు. ఇందుకు భారత ఆటగాళ్లు ఏం మినహాయింపు కాదు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం జాతీయ జట్టులో ఆడకపోతే దేశవాలీ క్రికెట్‌లో ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొందరు ఆటగాళ్లు బీసీసీఐ ఆదేశాలను సైతం పెడచెవిన పెట్టారు.
ఐపీఎల్‌లాంటి క్రికెట్ లీగ్స్ ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొచ్చిన తర్వాత యువ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌ను పట్టించుకోకపోవడం, ముందుగానే రిటైరవడంలాంటివి చేస్తున్నారు. తాజాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు కూడా బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోకుండా ఐపీఎల్ పై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టి ఏడాదంతే టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యమిస్తున్న ప్లేయర్స్ కు కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజుతోపాటు అదనంగా బోనస్ ఇవ్వాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
టెస్ట్ క్రికెట్ కు క్రమంగా ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో BCCI లాంటి క్రికెట్ పెద్దన్న ఈ సాంప్రదాయ క్రికెట్ ను బతికించడానికి నడుం బిగిస్తోంది. క్రికెట్ లీగ్స్ ని కాకుండా టెస్ట్ క్రికెట్ ను పట్టించుకునే వాళ్లకు బోనస్ ఇవ్వాలన్న ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు ఇస్తున్నారు. దీనికితోడు బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ప్లేయర్స్ కు ఏడాదికి కొంత మొత్తం వస్తూనే ఉంటుంది. ఏ+ కేటగిరీలోని వాళ్లకు రూ.7 కోట్లు, ఎ కేటగిరీ వాళ్లకు రూ.5 కోట్లు, బి కేటగిరీలో వాళ్లకు రూ.3 కోట్లు, సి కేటగిరీలోని వాళ్లకు రూ.కోటి బీసీసీఐ చెల్లిస్తోంది. ఇప్పుడు వీటికి అదనంగా ఏడాదంతా ప్రతి టెస్ట్ సిరీస్ ఆడే ప్లేయర్స్ కు బోనస్ ఇవ్వాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.
“ఓ ప్లేయర్ కేలండర్ ఏడాదిలో ఉన్న ప్రతి టెస్ట్ సిరీస్ ఆడితే ఏడాదికి ఇచ్చే మొత్తంతోపాటు అతనికి అదనపు మొత్తం లభిస్తుంది. ప్లేయర్స్ రెడ్ బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపేందుకే ఈ నిర్ణయం. టెస్ట్ క్రికెట్ ఆడినందుకు లభించే అదనపు ఆదాయం ఇది” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సదరు రిపోర్టు చెప్పింది.
ఏడాదంతా ఫిట్ గా ఉంటూ టీమిండియా ఆడే ప్రతి టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉన్న ప్లేయర్స్ దీని వల్ల లాభపడనున్నారు. ఇలా వచ్చే అదనపు డబ్బు సాంప్రదాయ క్రికెట్ ను చిన్నచూపు చూస్తున్న యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం టీ20 లీగ్స్ ఆడితే చాలు కోట్ల కొద్దీ డబ్బు వచ్చి పడుతుందన్న భావనలో యువ ఆటగాళ్లు ఉన్నారు.
ఇషాన్ కిషన్ కూడా రంజీ ట్రోఫీని వద్దనుకొని ఐపీఎల్ పై దృష్టి సారించడానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. అలాంటి ప్లేయర్స్ కు చెక్ పెట్టి టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యమిచ్చే వారిని ప్రోత్సహించాలన్న బీసీసీఐ ఆలోచన మంచిదే అని చెప్పాలి. బోర్డు దీనికి ఆమోదం తెలిపితే ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత కొత్త పేమెంట్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఇప్పటికే 3-1 ఆధిక్యంలో ఉన్న టీమ్.. మార్చి 7 నుంచి చివరి టెస్టులో ఆడనుంది.