Sarfaraz Khan: జెర్సీ నంబర్ 97 వెనుక ఉన్న కథేంటో తెలుసా.. ?

Sarfaraz Khan: భారత జట్టులో చోటు దక్కడం లేదని ఊహాగానాలు.. టెస్ట్‌ జట్టు ప్రకటించే ప్రతీసారి.. ఈసారి జట్టులో చోటు పక్కా అనే వార్తలు. అసలు జట్టులోకి వస్తే రాణిస్తాడా… లేక చాలామంది ఆటగాళ్లలాగే అంచనాలు అందుకోలేక చతికిల పడతాడా అని… వీటన్నింటికి ఒకే ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌ సమాధానం చెప్పేశాడు. వన్డే తరహా ఆటతో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. తన ఎంపిక సరైందేనని… తనలో అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లో రాణించే సత్తా ఉందని సర్ఫరాజ్ నిరూపించుకున్నాడు. అంతేనా తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించి రికార్డు కూడా సృష్టించాడు.

సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ అదిరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టీమిండియా తరఫున సర్ఫరాజ్ బరిలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే తన తడాఖా చూపించాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లు ధీటుగా ఎదుర్కొంటూ భవిష్యత్ తారగా అంచనాలను నెలకొల్పాడు.

అయితే సర్ఫరాజ్ జెర్సీ నంబర్ వెనుక ఓ కథ దాగి ఉంది. సర్ఫరాజ్ జెర్సీ నంబర్ 97. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన తన తమ్ముడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్, తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటర్లేన్న విషయం తెలిసిందే. అయితే 97 నంబర్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

తన తండ్రి, కోచ్ అయిన నౌషద్ ఖాన్ పేరు నుంచి ఈ నంబర్ వచ్చింది. హిందీలో నౌ అంటే తొమ్మిది. సాత్ అంటే ఏడు. నౌషద్ పేరు ఉచ్చారణలో నౌ, సాత్ అనే పదాలు వస్తాయి. అందుకే తన తండ్రికి గుర్తుగా సర్ఫరాజ్ జెర్సీ నంబర్ 97గా ఎంచుకున్నాడు. అంతేకాకుండా సర్ఫరాజ్ ఖాన్ పుట్టిన ఏడాది 1997. జన్మదిన సంవత్సరంలో కూడా 97 నంబర్ ఉంది.

కాగా, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్ రనౌటవ్వడం అందర్ని అసహనానికి గురిచేసింది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించాడు. 48 బంతుల్లో అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. అరంగేట్ర టెస్టులో అత్యంత వేగంగా అర్ధసెంచరీ బాదిన రెండో భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యతో సమానంగా చరిత్రకెక్కాడు. టాప్‌లో యువరాజ్ సింగ్ (42 బాల్స్) ఉన్నాడు.

సర్ఫరాజ్ రనౌట్ విషయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. ఫ్రస్టేషన్‌తో అరుస్తూ క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు. మరోవైపు జడేజా దీనిపై స్పందిస్తూ తప్పంతా తనేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ అయిదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (110), కుల్‌దీప్ (1) ఉన్నారు. రోహిత్ శర్మ (131) శతకం సాధించాడు. జైస్వాల్ (10), రజత్ పటిదార్ (5), గిల్ (0) నిరాశపరిచారు.