YS Sharmila: ఇన్నాళ్లూ గుడ్డి గుర్రాల‌కు ప‌ళ్లు తోమారా?

YS Sharmila: ఇన్నాళ్లూ గుడ్డి గుర్రానికి ప‌ళ్లు తోమారా అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (Jagan Mohan Reddy) సెటైర్లు వేసారు ఆంధ్ర్రప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌ (YS Sharmila). 2024 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధానిగా హైద‌రాబాదే (Hyderabad) ఉండాల‌ని YSRCP నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశిస్తూ ష‌ర్మిళ సెటైర్లు వేసారు.

“” ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే…ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలే. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీలు లేవు. పోలవరం పూర్తి కాలేదు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు. కొత్త పరిశ్రమలు లేవు. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు. (AP Elections)

8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్ర ప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి.చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే…మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం.ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా వైసీపీకి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదు “” అంటూ విమర్శ‌లు గుప్పించారు.

ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న సొంత అన్న‌ను చెడుగుడు ఆడేసుకుంటున్నారు ష‌ర్మిళ‌. ఏ స‌భకు వెళ్లినా జ‌గన్ అన్న ఏం చేసాడు అంటూ స్థానిక ప్ర‌జ‌ల చేతే తిట్టిస్తున్నారు. తెలంగాణ‌లో KCRను గ‌ద్దె దించ‌డంలో ఒక ర‌కంగా ష‌ర్మిళ హస్తం కూడా ఉంది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు తాను ఒక తెలంగాణ బిడ్డ‌ను త‌న పార్టీకి త‌ప్ప తెలంగాణ అనే పేరు మ‌రో పార్టీకి లేదు అంటూ గ‌ర్వంగా చెప్పుకున్న ష‌ర్మిళ అక్క‌డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే.. నెమ్మ‌దిగా కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి ఆంధ్ర‌ప్రదేశ్‌లో అడుగుపెట్టారు.

తెలంగాణ‌లో ష‌ర్మిళ మ్యాజిక్ ప‌నిచేసింద‌ని అనుకుంటున్న కాంగ్రెస్ హైక‌మాండ్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూడా షర్మిళ సేవ‌ల‌ను వినియోగించుకుని ఇక్క‌డ కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయాల‌ని గ‌ట్టిగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ష‌ర్మిళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టినంత మాత్రాన ఇక్క‌డ కాంగ్రెస్ రావ‌డం కాస్త క‌ష్ట‌మైన అంశం అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌డాల్సిన ఓట్లు చీలి అవి ష‌ర్మిళ‌కు తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party) వెళ్లిపోయే అవ‌కాశం ఉంది. దాంతో జ‌గ‌న్ చాలా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఓట్లు చేజార‌కుండా ఉండేందుకు పార్టీకి ఎంతో న‌మ్మ‌కంగా ఉంటున్న‌వారిని కూడా వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌కు త‌ర‌లించ‌డం.. కొంద‌రికి టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డం వంటి చర్య‌లు చేప‌డుతున్నారు.