వడదెబ్బ తగిలిందా..ఇలా చేసి చూడండి

ఎండాకాలం వచ్చేసింది. ఇంకా ఏప్రిల్​ కూడా మొదలవకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక రాబోయే రోజుల గురించి ఆలోచిస్తే చెమటలు పట్టేస్తున్నాయి. ఎండాకాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య వడదెబ్బ. మండిపోయే ఎండలు, అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత వల్ల బయటకు వెళ్లేవాళ్లే కాదు ఇంట్లో ఉండేవాళ్లూ వడదెబ్బకు గురవుతారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలపై వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణానికే ప్రమాదం కూడా. మరి వడదెబ్బ తాకినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..

* నిజానికి వడదెబ్బలో హీట్ ఎగ్జాషన్, హీట్ ఇంజురీ, హీట్‌ స్ట్రోక్‌ అనే మూడు తేడాలు ఉంటాయి. హీట్‌ స్ట్రోక్‌ అంటే.. డీహైడ్రేషన్‌కు సంబంధించిన అనారోగ్యం. హీట్ ఎగ్జాషన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలసటగా ఉంటుంది, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కండరాల నొప్పి ఉంటుంది.
హీట్ ఇంజురీలో శరీర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
* హీట్‌ స్ట్రోక్‌ తీవ్రమైన సమస్య.. దీనిలో శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీని కారణంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది. స్ట్రోక్‌ సంభవించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
* వడ‌దెబ్బ రెండు రకాలు ఉంటుంది. మొదటిది క్లాసిక్ హీట్ స్ట్రోక్ , రెండవది ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్. క్లాసిక్ హీట్ స్ట్రోక్ కారణంగా వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. ముఖ్యంగా.. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, సిస్టిక్ ఫైబ్రోసిస్, స్లీప్ డిజార్డర్స్, కిడ్నీ, ఊపిరితిత్తులు, మీ శరీర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే మందులు వేసుకునే వారికి ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే లివర్‌, థైరాయిడ్‌, రక్తనాళాల సమస్యలు ఉన్నవారు క్లాసిక్ హీట్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది.
* ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ చిన్న వయస్సువారికి సంభవించే అవకాశం ఉంది. తీవ్రమైన వ్యాయామం, క్రీడాకారులు, వేడి వాతావరణంలో శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, డీహైడేషన్‌, శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, సూర్యరశ్మికి గురైనప్పుడు ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ వస్తుంది.

లక్షణాలు
వడదెబ్బ లక్షణాలు వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఒళ్లు నొప్పులు, అలసట, కళ్లు తిరగడం, చెమట, అటాక్సియా, మైకము, చర్మం కందిపోవడం, వికారం, వాంతులు, అధిక దాహం, తక్కువ మూత్ర విసర్జన, గుండె వేగంగా కొట్టుకోవడం, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన సందర్భాల్లో, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, బ్రెయిన్ వాపు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, మెటబాలిక్ ఫెయిల్యూర్, నరాల దెబ్బతినడం, గుండెకు రక్త ప్రసరణ తగ్గడం, హార్ట్ ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.
నివారణ చర్యలు
డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. వారి మెడికేషన్‌ సక్రమంగా తీసుకోవాలి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే… తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి.
ఆల్కాహాల్‌ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో తేలికపాటి వ్యాయామాలు ఉదయం 8 గంటల్లోపే ముగించాలి. వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నిర్జలీకరణం చెంది.. బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు.
ప్రథమ చికిత్స
ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్‌ ప్యాక్‌ పెట్టాలి. వడదెబ్బ తగిలినపుడు ఆ వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి. ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి. నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి. కొబ్బరినీళ్లు, చెరుకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం మంచిది.