గుండె ఆరోగ్యానికి ఈ ఆహారం బెస్ట్
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. ఇది నిరంతరం మన శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తూ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. అంతేకాదు రక్తం ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను అందించి కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు పంపిస్తుంది. ఒక్క నిమిషం గుండె పనితీరు మందగించినా, ఆగిపోయినా మనిషి ప్రాణానికే ప్రమాదం. అలాంటి ప్రాధాన్యత కలిగిన గుండెను పదిలంగా కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యంగా జీవించాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినన్ని నీళ్లు తాగడం, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడం వంటివి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. గుండెను ఎక్కువగా ప్రభావితం చేసేది మనం తినే ఆహారం, ఆహారపు అలవాట్లు. వాటిపై తగిన నియంత్రణ కలిగి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అవలంబిస్తే గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలేవో తెలుసుకుందాం..
ఆకు కూరలు
బచ్చలికూర, మెంతికూర, గోంగూర, ముల్లంగి ఆకులు, పాలకూర మొదలైన తాజా ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో తక్కువ మోతాదు లో కొవ్వు, కేలరీలు ఉండటమే కాకుండా ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. వీటిలో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఈ ఖనిజాలు గుండె యొక్క పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి ఎక్కువగా లభించే గోంగూర లో అధిక మోతాదులో పొటాషియం మరియు మెగ్నీషియం ఖనిజాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఆకు కూరలను రోజులో ఒక్కసారైనా భోజనంలో చేర్చుకోగలిగితే గుండె జబ్బుల ముప్పు 11 శాతం తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
తృణ ధాన్యాలు
తృణధాన్యాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. గోధుమలు, బార్లీ, మిల్లెట్, ఓట్స్, పప్పులు, బీన్స్ వంటివి తినడం గుండెకు మంచిది. ఎందుకంటే అవి సహజమైన ఫైబర్ మరియు విటమిన్లను అందిస్తాయి. వీటిలో విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తృణధాన్యాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
తాజా పండ్లు
పండ్లు సహజంగానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ప్రత్యేకంగా గుండె కు సంబంధించి ఆపిల్, అరటి పండ్లు , నారింజ పండ్లు, కమలాలు, బేరి పళ్లలో (స్ట్రాబెరీ నేరేడు పళ్ళు బ్లాక్‌బెర్రీ ) ,దానిమ్మ, ద్రాక్ష వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు తినటం వలన విటమిన్ B6, C లభిస్తుంది. అదేవిధంగా ఆరెంజ్ ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ C మోతాదు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫైబర్ పొటాషియం కూడా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యంగా, చైతన్యవంతంగా ఉండటానికి దోహదపడతాయి. అవకాడో తినడం వల్ల కూడా గుండెకు చాలా మంచిది. కొన్ని సీజన్లో లభించే నేరేడు పండ్ల కు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. సాధారణంగా స్ట్రాబెరీ, బ్లూబెర్రీ (నేరేడు) బ్లాక్ బెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇంప్లమేషన్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా వాల్‌నట్స్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండెకి మేలు చేస్తాయి.
కూరగాయలు
కూరగాయలో మనం నిత్యం తీసుకునే వాటిలో టమేటాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో దోహదపడతాయి ఇందులో విటమిన్ K, C అధికంగా లభిస్తుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఇతర కూరగాయల గురించి చెప్పుకుంటే బీన్స్, చిక్కుడు రకాలు కూడా గుండెకు మేలు చేస్తాయి. బ్రోకోలి, క్యాప్సికమ్ కూడా ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు. దుంపలలో స్వీట్ పొటాటో (చిలకడ దుంపలు) తినడం గుండె కు మంచిది. ఇక ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకం కూడా గుండె ఆరోగ్యానికి మంచిది.
ఆలివ్ ఆయిల్
వంట నూనెలలో కెల్లా గుండెకు అత్యంత మేలు చేకూర్చే వంటనూనె ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక తర్వాత లిస్టులో కుసుమ నూనె, నువ్వుల నూనె కూడా గుండె ఆరోగ్యానికి మంచివే. ఎలాంటి నూనె అయినా అధికంగా వాడితే గుండెకు ప్రమాదమే. కాబట్టి సాధ్యమైనంత వరకు నూనె వాడకాన్ని తగ్గించడం గుండెకు ఆరోగ్యకరం.
చేపలు
మాంసాహారం తినేవారు చికెన్ మటన్ కంటే కూడా చేపలు ఎంచుకోవడం మంచిది. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్ ట్యూనా చేపల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఫిష్ ఆయిల్, ఫ్యాటీ ఫిష్‌ను తీసుకోవడం వలన కార్డియో వాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తీసుకోవడం వలన బీపీ కూడా అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా చికెన్, మటన్ బదులు చేపలు తీసుకుంటే గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఇవి వద్దు
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేయబడిన ఫుడ్, డీప్ ఫ్రై చేసిన వంటకాలు, అధిక కొవ్వు ఉండే డైరీ లేదా పాల ఉత్పత్తులు, ఎక్కువగా ఎర్ర మాంసం,అధిక మసాలా ఉండే ఆహారాలు, నిల్వ ఉంచిన ఆహారం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. అంతే కాకుండా ఉప్పు తగ్గించుకోవడం చాలా ఉత్తమం.
గుండెకు మేలు చేసే ఆహారాలు తీసుకోవడంతో పాటు రోజు క్రమం తప్పకుండా నడవడం వంటి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.