Health: బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా తింటున్నారా.. ఈ రిస్క్‌లు తప్పవు
Health: బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో అది చేసే సమయం కూడా అంతే ముఖ్యం. కొందరికి బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటు ఉంటుంది కానీ లేట్‌గా తింటుంటారు. ఇలా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఆలస్యంగా చేసేవారికి గుండె సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుందని జర్నల్ నేచర్ కమ్యునికేషన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దాదాపు ఏడేళ్ల పాటు 10,000 మందిని పెట్టి రీసెర్చ్ చేయగా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ త్వరగా చేసిన వారిలో గుండె పదిలంగా ఉండగా.. చేయని వారికి ఏదో ఒక రకమైన గుండె సమస్య వచ్చినట్లు గుర్తించారు.
బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉదయాన్నే లేవగానే తినే మొదటి మీల్. తినాల్సిన సమయంలో కాకుండా ఆలస్యంగా తింటుంటే.. వారిలో గుండె సమస్యల ముప్పు తీవ్రంగా పెరుగుతోందట. ఒక గంట ఆలస్యం అయినా కూడా ఆ ముప్పు 6 శాతానికి పెరుగుతోంది కాబట్టి ఉదయం 9 కల్లా బ్రేక్ ఫాస్ట్ అయిపోవాల్సిందే. ఇక మనం రోజులో తినే లాస్ట్ మీల్ డిన్నర్. చాలా మంది ఏడు గంటల కల్లా డిన్నర్ ముగించేసుకుని 9 కల్లా నిద్రపోతే మంచిది అని చెప్తుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటివారు కనీసం 9 లోపు తినేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత తినాల్సి వచ్చినా లైట్‌గా తింటే మంచిది. రాత్రి 9 గంటలు దాటాక తినేవారిలో 28% మందికి గుండె పోటు, స్ట్రోక్ వచ్చే సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
సాయంత్రం వేళల్లో బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి. కానీ ఇలా వేళకు తినకపోవడం వల్ల ఆ బ్లడ్ ప్రెషర్ అనేది సాయంత్రం వేళల్లో ఎక్కువ అయిపోయి రక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయి. దీని వల్ల రక్తం గడ్డ కట్టడం ఫలితంగా గుండె పోటు రావడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పుడున్న కాలంలో మంచి ఆహారం తింటే గొప్ప. అలాంటిది ఇలా స్ట్రిక్ట్ టైమింగ్స్ పాటించాలంటే చాలా మందికి సాధ్యం కాని పని. దాంతో ఎప్పుడు తిన్నా కూడా మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారా లేదా అన్న అంశంపై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది.