టీచర్ పాఠం చెబుతుండగానే కొట్టుకున్న విద్యార్థులు
చిన్న తనం నుంచే ఓర్పు, సహనం, క్రమశిక్షణ వంటివి నేటి పిల్లల్లో వందల్లో ఏ ఒక్కరిలో చూస్తున్నాం. చాలా మంది సినిమాల ప్రభావం లేదా… తల్లిదండ్రులు భయభక్తులు నేర్పకపోవడం, గారాభం చేయడం కూడా కారణం అవుతున్నాయి. చిన్న విషయాలకే కోప్పడం పిల్లల్లో సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో చోటుచేసుకుంది. పాఠ్య పుస్తకంలో ఓ పేజీని సహచర విద్యార్థి చింపాడని ఆగ్రహించిన మరో విద్యార్థి అతన్ని రైటింగ్ ప్యాడ్ తో కొట్టడంతో సదరు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు ఇలా..
గుడివాడ పట్టణంలోని కృష్ణా జిల్లా గుడివాడ మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సుంకర మణికంఠ, తన మిత్రుడైన దుర్గాప్రసాద్ పుస్తకం చూస్తుండగా పొరపాటున ఓ పేజీ చిరిగింది. దీంతో ఆగ్రహించిన దుర్గా ప్రసాద్, మణికంఠ తలపై ప్యాడ్ తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పొరపాటున పేజీ చింపానన్నా.. వినకుండా దుర్గాప్రసాద్ తనను కొట్టాడంటూ బాలుడు మణికంఠ వాపోయాడు. తరగతి గదిలోనే విద్యార్థి తలకు తీవ్రంగా గాయమైనా పాఠశాల యజమాన్యం సరిగా స్పందించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి ప్రాణం మీదకు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాల యజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం… ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు.. బాలుడి తలకు గాయమైందని.. ఆరుకుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుండగానే ఈ ఘటనంతా జరగడం విశేషం.