Restaurant: ఈ రెస్టారెంట్‌లో డ‌బ్బులిచ్చి మ‌రీ కొట్టించుకుంటార‌ట‌

Restaurant: ఎవరైనా రెస్టారెంట్‌కి వెళ్లి న‌చ్చిన ఫుడ్ ఆర్డ‌ర్ ఇచ్చుకుని తింటారు. లేదంటే కాసేపు అక్క‌డే కూర్చుని క‌బుర్లు చెప్పుకోవ‌డానికి వెళ్తారు. కానీ జ‌పాన్‌లోని న‌గోయా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కి మాత్రం అక్క‌డి అమ్మాయిల చేత చెంప‌ల‌పై కొట్టించుకోవ‌డానికి వెళ్తున్నార‌ట‌. మీరు విన్న‌ది నిజ‌మే. ఇక్క‌డ డ‌బ్బులు చెల్లించి మ‌రీ కొట్టించుకుంటార‌ట‌.

క‌స్ట‌మర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అంద‌మైన అమ్మాయిల‌ను ఈ రెస్టారెంట్ నియ‌మించుకుంది. ఇలా డ‌బ్బులు ఇచ్చి కొట్టించుకునే దానిని కూడా ఒక వంట‌కం అనే చెప్తున్నారు. దీని పేరు న‌గోయా లేడీస్ స్లాప్. ఒక‌సారి కొడితే 300 యెన్లు చెల్లించాలి. అంటే మ‌న క‌రెన్సీలో రూ.170. అంత‌కంటే ఎక్కువ సార్లు కొట్టించుకోవాలంటే ఎక్కువ డ‌బ్బులు చెల్లించాలి.

2012లోనే ఈ వింత ఆప్ష‌న్‌ని రెస్టారెంట్‌లో పెట్టారు. అప్ప‌ట్లో ఏదో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇలా చేసారు. కొంద‌రు ఈ చోద్యాన్ని చూసేందుకు వ‌స్తుంటే మ‌రికొంద‌రు నిజంగానే కొట్టించుకోవ‌డానికి వ‌చ్చేవారు. అలాగ‌ని వారు మ‌రీ గ‌ట్టిగా కొట్ట‌రు. వారు కొట్టిన‌ప్పుడు ఏదో తెలీని హాయి క‌లుగుతుంద‌ట‌. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇలా కొట్టించుకోవ‌డానికి వ‌స్తుంటారు. అయితే దీనిని చాలా మంది మ‌రీ సీరియ‌స్‌గా తీసుకుని కేవ‌లం కొట్టించుకునేంద‌కే రెస్టారెంట్‌కి వ‌స్తున్నార‌ట‌. దాంతో ఈ ఆప్ష‌న్‌ను రెస్టారెంట్ నుంచి తీసేసారు. పాత వీడియోల‌ను చూసి క‌స్ట‌మర్లు కేవ‌లం కొట్టించుకోవ‌డానికే రెస్టారెంట్‌కి వ‌స్తున్నార‌ని తెలిసి యాజ‌మాన్యం ఈ స‌ర్వీస్ లేద‌ని ప్ర‌క‌టించింది.