Winter Depression: శీతాకాల శత్రువు నుంచి తప్పించుకుందాం
Winter Depression: శీతాకాలం, వర్షాకాలం అంటేనే రోగాల కాలం. ఈ రెండు రుతువుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అవి ఒక పట్టాన తగ్గవు. వాటిలో డిప్రెషన్ ఒకటి. ఇది మనం తరచూ వినే డిప్రెషన్ కాదు. కేవలం శీతాకాలంలో మాత్రమే ఇది వస్తుంది. అసలు ఏంటీ వింటర్ డిప్రెషన్? దీని నుంచి మనల్ని మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి?
వింటర్ డిప్రెషన్ అంటే ఏంటి?
ఈ చలికాలంలో ఏ పనీ చేయబుద్ది కాదు. ఎప్పుడూ డల్‌గా కనిపిస్తుంటారు. చిరాకుగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది వింటర్ డిప్రెషన్ అని అర్థం.
ఎవరికి వస్తుంది?
ఇది అందరికీ వస్తుంది అని చెప్పలేం. కొందరు శీతాకాలం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ ఈ శీతాకాలంలో వచ్చే చలిని తట్టుకోలేనివారిలో వింటర్ డిప్రెషన్ కనిపించే అవకాశం ఉంటుంది. (winter depression)
ఎలా ప్రవర్తిస్తుంటారు?
ఎప్పుడూ యాక్టివ్‌గా తమ పని తాము చేసుకుపోతూ ఉన్నట్టుండి శీతాకాల సమయంలో డల్ అయిపోతుంటారు. ఒకప్పుడు చురుగ్గా వ్యాయామాలు, ఇంటి పనులు చకచకా చేసుకునేవారు అసలు ఒక్క పని చేయకుండా ఎప్పుడూ మంచానికే అతుక్కుపోతుంటారు. సరిగ్గా తినకపోవడం, నిద్రపోకుండా ఆలోచిస్తుండడం వంటివి చేస్తుంటారు.
ఎప్పుడు కోలుకుంటారు?
ఇలా వింటర్ డిప్రెషన్‌తో బాధపడేవారు వేసవి కాలానికి మామూలుగా మారిపోతారు. మళ్లీ ఎప్పటిలాగే తమ పనులు తాము చేసుకుంటూ యాక్టివ్‌గా ఉంటారు. (winter depression)
వింటర్ డిప్రెషన్ వస్తే ఏం చేయాలి?
* లేలేత సూర్య కిరణాలు శరీరానికి తాకేలా ఉదయాన్నే ఒక అరగంట పాటు ఎండలో కూర్చోవాలి. సూర్యకిరణాలు శరీరానికి తాకగానే విటమిన్ డి పుంజుకుంటుంది. ఆ సమయంలో సెరోటొనిన్ అనే హ్యాపీ హర్మోన్ విడుదల అవుతుంది. అది మూడ్ పాడవ్వకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా చేస్తుంది.
*ఈ వింటర్ డిప్రెషన్ ఉన్నవారికి వ్యాయామం చేయాలన్నా మూడ్ రాదు. అసలు బెడ్ దిగడానికే ఇష్టపడరు. కాస్త ఓపిక తెచ్చుకుని చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటే మూడ్ ఇట్టే మారిపోతుంది.
*ఒంటరిగా ఉండకూడదు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో గడపండి. వారితో కబుర్లు చెప్పండి. ఏదన్నా మీకు నచ్చిన సినిమా చూడండి.