Health: వీటిని వండేస్తున్నారా.. అస్స‌లు వ‌ద్దు

Health: మామూలుగా అన్ని ర‌కాల ఆకు కూర‌లు, కూర‌గాయ‌ల‌ను వండుకుని తింటుంటాం. అయితే కొన్ని ర‌కాల కూర‌గాయ‌లు, ఆకు కూర‌ల‌ను అస‌లు వండ‌కూడ‌ద‌ట‌. వండితే వాటిలోని పోష‌కాలు పోతాయ‌ని అంటున్నారు నిపుణులు. అస‌లు ఎలాంటివి వండ‌కూడ‌దు? వాటిని వండితే ఏమ‌వుతుంది.. వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం.

పాల‌కూర (spinach)

పాల‌కూర‌తో ప‌ప్పు, కిచిడీ చేసుకుంటూ ఉంటారు. నిజానికి పాల‌కూర‌ను అస‌లు వండకూడ‌ద‌ట‌. ఇందులో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. దీనిని వేడి చేయ‌డం వంటివి చేస్తే పోష‌కాలు పోతాయి. మ‌రి దీనిని తిన‌డం ఎలాగంటే.. స‌లాడ్స్‌లో వేసుకోవ‌డం కానీ స్మూతీలుగా చేసుకుని తాగ‌డం కానీ చేస్తే అందాల్సిన పోష‌కాలు అందుతాయి.

టొమాటోలు (tomatoes)

టొమాటోల‌లో ఎక్కువ‌గా విట‌మిన్ సి ఉంటుంది. ఇది వేడి తగిలితే పోయే విట‌మిన్. కాక‌పోతే టొమాటోల‌ను ప‌చ్చిగా తిన‌లేం కాబ‌ట్టి కాస్త లైట్‌గా ఉడికిస్తే స‌రిపోతుంది.

బ్రొకోలీ (broccoli)

అత్య‌ధిక పోష‌కాలు క‌లిగిన కూరగాయ‌ల్లో బ్రొకోలీ ఒక‌టి. దీనిని ముక్క‌లుగా క‌ట్ చేసి కేవ‌లం 10 సెకెన్లు మాత్ర‌మే ఉడికించి తినేస్తే బెట‌ర్. అంత‌కుమించి ఉడికిస్తే తిన్నా తిన‌క‌పోయినా ఒక్క‌టే. అందుకే దీనిని స‌లాడ్స్‌, స్మూతీల‌తో వాడ‌తారు.

వెల్లుల్లి (garlic)

వెల్లుల్లిలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించే సుగుణాలు పుష్క‌లంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ కూడా ఇట్టే క‌రిగిపోతుంది. ఇందులోని ఆల్లిసిన్ అనే పోదార్థం వల్లే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వేడి చేయ‌డం వ‌ల్ల ఆ ఆల్లిసిన్ పోతుంది. మ‌రీ ప‌చ్చిది కూడా తిన‌లేం కాబ‌ట్టి వంట అయిపోయాక వెల్లుల్ని వేసి కాస్త అటూ ఇటూ తిప్పితే పోష‌క విలువ‌లు పోకుండా ఉంటాయి.

పెరుగు (curd)

పెరుగుని అస‌లు వంట‌ల్లోనే వాడ‌కూడ‌దు. చాలా మంది చికెన్ వంటివి వండేట‌ప్పుడు పెరుగు వేస్తుంటారు. అది అస్స‌లు మంచిది కాదు. పెరుగులో ప్రో బ‌యోటిక్స్ ఉంటాయి. పెరుగుని వేడి చేస్తే ప్రో బ‌యోటిక్స్ పోతాయి. కాబ‌ట్టి పెరుగుని నేరుగా తిన‌డానికే ప్ర‌య‌త్నించండి. కానీ రాత్రి వేళల్లో మాత్రం వ‌ద్దు.

గ్రీన్ టీ (green tea)

గ్రీన్ టీని తాగేవారు ముందు నీళ్లు వేడి చేసి దాంట్లో టీ బ్యాగ్ వేసుకుని తాగుతుంటారు. ఇంకొంద‌రు తెలీక నీళ్ల‌లోనే టీ బ్యాగ్ వేసి మ‌ర‌గ పెడ‌తారు. ఇలా చేస్తే ఇక ఆ టీ తాగి కూడా వేస్టే. ఎప్పుడైనా గ్రీన్ టీని గోరువెచ్చ‌టి నీటితో తాగాలి.

ఆలివ్ నూనె (olive oil)

ఆలివ్ నూనెను వండే స‌మ‌యంలో కాకుండా కేవ‌లం స‌లాడ్స్‌లోనే వేసుకుని తింటుంటారు. ఎందుకంటే ఆలివ్ నూనెను సాధార‌ణ నూనెల్లా వేడి చేస్తే ఇందులో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి. అప్పుడు ఆలివ్ నూనె కూడా సాధారణ నూనెలా హానిక‌ర‌మైన కొవ్వుల‌తో నిండిపోతుంది.