Health: కొబ్బరి నీళ్లా… పండ్ల రసాలా.. ఏది బెస్ట్?
Health: హెల్తీ డ్రింక్స్ అనగానే కొబ్బరి నీళ్లు.. పండ్ల రసాలు మాత్రమే గుర్తుకువస్తాయి. అయితే పండ్ల రసాలు మంచివా కొబ్బరి నీళ్లు మంచివా అంటే కొంచెం చెప్పడం కష్టమే. అసలు ఈ రెండింట్లో ఏది బెస్టో తెలుసుకుందాం.
పండ్ల రసాలైనా కొబ్బరి నీళ్లయినా శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి. కాకపోతే పండ్ల రసాలతో పోలిస్తే కొబ్బరి నీళ్లలో కేలొరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో 64% ఉండేది నీరే. ఉదాహరణకు 100 గ్రాముల యాపిల్ జ్యూస్లో 46 కేలొరీలు ఉంటాయి. అదే 100 గ్రాముల కొబ్బరి నీళ్లలో కేవలం 18 కేలొరీలే ఉంటాయి. ఒకవేళ మీకు ఎక్కువ కేలొరీలు అవసరం లేదు అనుకుంటే కొబ్బరి నీళ్లే ఎంచుకోండి.
పండ్ల రసాల్లో చెక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ సహజంగానే తీపి ఎక్కువగా ఉండే పండ్లలో షుగర్ కంటెంట్ మరీ ఎక్కువ. కానీ కొబ్బరి నీళ్లలో అలాంటిదేమీ ఉండదు. ఇక శరీరానికి కావాల్సిన పోషకాలలో పీచు ప్రధానమైనది కాబట్టి ఇది కొబ్బరి నీళ్లలో తక్కువగా ఉంటుందనే చెప్పాలి. పండ్ల రసాల్లోనే ఎక్కువ పీచు ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరం డీహైడ్రేట్ అవ్వదు.
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలి?
* శరీరం డీహైడ్రేట్ అయినట్లు అనిపిస్తే వెంటనే ఒక గ్లాసు తాగి చూడండి. వెంటనే హైడ్రేట్ అవుతుంది. ఉత్సాహంగా కనిపిస్తారు.
*వాంతులు అవుతున్నట్లు కడుపులో అల్సర్లు ఉన్నట్లైతే కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి.
*కేలొరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డ్రింక్.
*అసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి.
*గర్భిణులకు బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి.
*కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
పండ్ల రసాలు ఎప్పుడు తాగాలి?
*నీరసంగా అనిపిస్తుంటే ఏదైనా ఒక పండ్ల రసం తాగాలి.
*ఎనీమియా ఉన్నట్లైతే బీట్రూట్, క్యారెట్ రసాలు తరచూ తాగుతూ ఉండాలి.
*ఆరోగ్యకరమైన చర్మం కోసం రకరకాల పండ్ల రసాలు ట్రై చేస్తూ ఉండాలి.
*మలబద్ధక సమస్యలు ఉంటే పండ్ల రసాలు బెస్ట్
*కాకపోతే ఖాళీ కడుపున పండ్ల రసాలు అస్సలు తీసుకోకూడదు.