Depression నుంచి ఎలా బయటపడాలి?
డిప్రెషన్.. (depression) జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో దీని బారిన పడడం ఖాయం. చిన్నా.. పెద్దా.. ఆడ.. మగ.. ఇలా ఎటువంటి భేదం లేకుండా ఎవరికైనా ఈ సమస్య రావొచ్చు. ఒక సారి మానసిక ఒత్తిడికి గురయ్యామంటే క్రమేపీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఆందోళన, చెప్పలేనంత బాధ.. డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. నిన్న ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూతురు మీరా కూడా డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకుంది. ఆ పిల్ల వయసు కేవలం 17 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో డిప్రెషన్ బారినపడి ఆత్మహత్యలు చేసుకోవాలి అనుకుంటున్నారంటే..దీనిని అలుసుగా తీసుకోకూడదు. అసలు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి?
ఒత్తిడికి కారణాలు అనేకం..
ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడిన, ఏదైనా కోల్పోయినా, ఎవరితోనైనా గొడవ పడినా, మనకు నచ్చింది దక్కకపోయినా, అనుకున్నది అవ్వకపోయినా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా మానసిక ఒత్తిడి మొదలవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారుతుంది. ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటివి కూడా డిప్రెషన్‌కి కారణమవుతాయి. కొన్ని రకాల మందులు ఎక్కువ కాలం వాడడం, సామాజిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి డిప్రెషన్లోకి నెట్టేస్తాయి. (depression)
కారణాలేవైనా సరే.. డిప్రెషన్‌కి గురైతే మానసికంగా కుంగిపోతాం. ఈ డిప్రెషన్‌ని జయించేందుకు చాలా మంది మందులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇది సరైనదేనా అని అంటే.. కాదని చెప్పలేం.. అలా అని అవునని చెప్పలేం. అయితే.. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు మన మైండ్‌ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే ఈ డిప్రెషన్ మన దరిదాపుల్లోకి కూడా రాలేదు.
ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే ..
ఎవరైనా రిజెక్ట్ చేసినా… అవహేళన చేసినా… బాధ పెట్టినా మనం అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంటాం. అయితే.. ప్రతి ఒక్కరినీ, ప్రతి విషయాన్నీ మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎందుకు ఆ మాట అన్నారు ? ఉన్న మాటే అన్నారా లేదా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా ? వారికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వంటి అంశాల దిశగా మన ఆలోచన ఉండాలి. ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే ఇక జీవితంలో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేం.
ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది
ఆశకు హద్దుండాలి. ఆలోచనలకు పరిధి ఉండాలి. లక్ష్యాలకు లిమిట్స్ ఉండాలి. ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంచనాలకు మించి గోల్స్ సెట్ చేసుకుని వాటిని అందుకోలేక పోయామని నిరుత్సాహపడే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి కారణాల వల్ల కూడా స్ట్రెస్ మొదలవుతుంది. అంచనాలను అందుకోలేకపోతే ఆత్మ విశ్వాసం కూడా దెబ్బ తింటుంది. అందుకే ఆశలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. (depression)
ఇవి పాటించండి
ప్రతి రోజూ ధ్యానం చేయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మెడిటేషన్‌ను దినచర్యలో భాగం చేసుకుంటే మనసు, మెదడు రిలాక్స్ అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
యోగాసనాలపై కాన్సెన్ట్రేట్ చేయండి. ఆసనాలు వేయడం ద్వారా మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఫిట్‌గా మారుతారు.
మీకు సంగీతం అంటే ఇష్టముంటే రోజూ ఓ అరగంట సేపైనా మీకు నచ్చిన పాటలను విని ఎంజాయ్ చేయండి. మీకు డ్రాయింగ్ అంటే ఇష్టమైతే రోజూ ఓ గంటసేపు అందులోనే నిమగ్నమవ్వండి.
కంటి నిండా నిద్ర లేక పోయినా స్ట్రెస్ మొదలవుతుంది. అందుకే ప్రతి రోజూ తప్పనిసరిగా 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి.
కొంతమందికి ఒంటరిగా ఉంటే ఇష్టం. కానీ మానసిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు మాత్రం పది మందితో మాట్లాడటానికి ప్రయత్నించండి. దీని వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆలోచనలకు బ్రేక్ పడుతుంది.