మహిళలకు పాదాభివందనం చేసిన నారా లోకేష్
యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నేటితో 38వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాగా.. బుధవారం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారా లోకేష్.. తెలుగు మహిళలతో భేటీ అయ్యారు. అనంతరం వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. అమ్మలేనిది జన్మ లేదని.. ఈ భూమి కన్నా ఎక్కువ భారం మహిళలే మోస్తారని తెలిపారు. అలాంటి మహిళలందరికీ పాదాభివందనం అంటూ లోకేష్ మోకాళ్లపై కూర్చుని వందనం చేశారు.
తల్లిని అవమానించారని బాధపడుతూ..
ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవసమానులుగా చూస్తారని.. అలాంటిది తన తల్లినే అసెంబ్లీ సాక్షిగా అవమానించారని.. అందుకు చాలా బాధ కలిగిందన్నారు లోకేష్. తన తల్లి ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించలేదని… కుటుంబ పోషణ గురించే ఆలోచించే వారని అన్నారు. ప్రస్తుతం తన భార్య బ్రాహ్మణి హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటున్నారని.. తన తల్లి ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారని తెలిపారు. తన తండ్రి చంద్రబాబు ఎప్పుడూ ఏడవడం చూడలేదని… తన తల్లిని అవమానించారనే ఆరోజు తొలిసారి కన్నీరుపెట్టుకున్నారని చెప్పారు. ఈ ఘటన నుంచి తన తల్లి కోలుకోవడానికి చాలా రోజులు పట్టిందని చెప్పుకొచ్చారు.
వైసీపీ మహిళలను మోసగించింది..
సీఎం వైఎస్ జగన్ దిశా చట్టం తీసుకొచ్చానని అబద్దపు ప్రచారం చేసుకుంటూ.. మహిళలను మోసగించారని నారా లోకేష్ విమర్శించారు. దిశ చట్టంతో ఎంతమదికి శిక్ష వేశారని ఆయన ప్రశ్నించారు. ఇక మంత్రి రోజా తనకు ఒక సందర్భంలో తనకు చీర, గాజులు పంపిస్తానని అన్నారని.. అది మహిళలను కించపరిచినట్టేనని ఆయన పేర్కొన్నారు. చీర, గాజులు వేసుకున్న వాళ్లు చేతకాని వాళ్లా అని రోజాను ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి.. అదే మద్యంపై డబ్బులు దండుకుంటుందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.