లోఫర్.. బెగ్గర్.. ఈ లొల్లి అవసరమా డైరెక్టర్ గారూ!
నోరు ఉంది కదా అని ఎంతోస్తే అంత అనేయకూడదు. ఇంట్లో అయినా బయట అయినా ఆచి తూచి మాట్లాడాలి. అందుకే పెద్దలు అంటుంటారు.. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. ఇప్పుడు ఈ చర్చ అంతా దర్శకుడు వెంకటేష్ మహా గురించే. తీసింది మూడు సినిమాలే అయిన ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం కేరాఫ్ కంచెరపాలెం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరించాల్సిన ఆయన… కన్నడ సూపర్‌స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి చిక్కుల్లో పడ్డారు.ఇటీవల వెంకటేష్ మహా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయనతో పాటు దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఇండియన్ బ్లాక్ బ్లస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమలాంటి దర్శకులు తమ అభ్యుదయ భావాలను పక్కనపెట్టి సినిమాలు చేస్తే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలం అని అన్నారు. కానీ, తాము అలాంటి సినిమాలు చేయడం లేదని, విలువలతో కూడిన సినిమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలను కూడా డిగ్రేడ్ చేస్తున్నారని, అవి ఓటీటీ సినిమాలు అని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇండైరెక్టుగా ‘కేజీఎఫ్ 2’ సినిమాను కోడ్ చేస్తూ ఒక సినిమా ఉంది. అందులో హీరో తల్లి కొడుకుని గొప్ప వాడు అవ్వాలని చెబుతుందని, మళ్లీ ఆ కొడుకు తల్లికు బంగారం తెస్తానని మాట ఇస్తాడు. అందుకోసం బంగారం తవ్వే వద్దకు వెళ్తాడు. అక్కడ వాళ్లను ఉద్దరిస్తాడు. మళ్లీ చివర్లో ఆ బంగారం తీసేవాళ్లందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఆ బంగారం మొత్తం ఒక చోట పడేస్తాడు. అలాంటి గొప్పవాడు అవ్వమని ఆ తల్లి చెప్పడం. అలాంటి సినిమాను గొప్ప సినిమా అంటూ మనం ఎగబడి చూసేస్తాం. 500, 1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టే ఈ సినిమాలన్నీ పాప్‌కార్న్ సినిమాలు. అంటే.. ఇలాంటి సినిమాలు చూస్తూ పాప్‌కార్న్ తింటున్నప్పుడు పాప్‌కార్న్ కిందపడితే సీన్ మిస్సయినా పర్వాలేదు అని పాప్‌కార్న్ ఏరుకుంటాం. అలాంటివే ఈ సినిమాలు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దాంతో యశ్ అభిమానులు, కన్నడ సినిమా ప్రేక్షకులు వెంకటేష్ మహాను ఏకిపారేస్తున్నారు. యశ్‌కు, కేజీఎఫ్ సినిమాను ఎంతో కష్టపడి తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు క్షమాపణలు చెప్పాలంటూ ట్విటర్లో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. అంతేకాదు ఇన్సెక్యూర్ లోఫర్, అటెన్షన్ బెగ్గర్ అనే హ్యాష్‌ట్యాగులు కూడా ట్విటర్లో టాప్ 3లో ట్రెండ్ అవుతున్నాయంటే… వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారానికి దారి తీసాయో అర్థమవుతోంది. మరోపక్క మనకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ తదితరులు తామే కేవలం ఆ సమయానికి ఎలా ప్రవర్తించాలో అలా నడుచుకున్నామే తప్ప సినిమాను కించపరచాలన్న ఉద్దేశం తమకు మాత్రం లేదంటూ ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు.
మరోపక్క ఈ మొత్తం ఇంటర్వ్యూకి ప్రధాన కారకురాలైన ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ గురించి కూడా అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు. అభిప్రాయాలు తెలుసుకోవడంలో తప్పు లేదుగా కానీ ఓ దర్శకుడు మరో దర్శకుడు తెరకెక్కించిన సినిమాను తక్కువ చేసి మాట్లాడుతుంటే.. ఆపకుండా నవ్వుతూ వింటూ కూర్చోవడం సిగ్గుచేటు అంటూ క్లాస్ పీకుతున్నారు. ఇప్పుడు ట్విటర్ మొత్తం వెంకటేష్ మహాను తిట్టడంలోనే మునిగిపోయింది. రేపటిలోగా వెంకటేష్ మహా క్షమాపణలు చెప్పకపోతే ఇది మొత్తం టాలీవుడ్ సినిమాలపై ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు.
దాంతో రాత్రి ఓ వీడియో విడుదల చేస్తూ అందులో క్షమాపణలు చెప్పారు వెంకటేష్ మహా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన తీరులో తప్పుందేమో కానీ తన అభిప్రాయం మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమేనని అన్నారు వెంకటేష్. తాను ఒక సినిమాను, ఒక భాషను కించపరచలేదని కొన్ని సినిమాల తీరును గురించి మాత్రమే చెప్పానని అన్నారు. ఇప్పటికీ తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోనని తెలిపారు.