Odisha Train Accident: బ‌తికుండ‌గానే మార్చ‌రీలో..

Kolkata: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో (odisha train accident) ఓ వ్యక్తి చ‌నిపోయాడ‌నుకుని అత‌న్ని మార్చ‌రీలో పెట్టారు. తీరా చూస్తే ఆ వ్య‌క్తి బ‌తికే ఉన్నాడు. ఈ ఘ‌ట‌న వెస్ట్ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మొన్న శుక్ర‌వారం రాత్రి ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని పెను ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 300 మంది మృత్య‌వాత‌ప‌డ్డారు. ప్ర‌మాదానికి గురైన కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) రైలులో క‌ల‌క‌త్తాకు చెందిన విశ్వ‌జిత్ అనే యువ‌కుడు ప్ర‌యాణించాడు. ఇత‌న్ని తండ్రి హేలారాం ద‌గ్గ‌రుండి రైలు ఎక్కించాడు. అయితే కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదానికి గురైంద‌ని తెలిసి హేలారాంకు గుండె ఆగినంత ప‌నైంది.

వెంట‌నే హేలారాం త‌న కుమారుడికి ఫోన్ చేసాడు. విశ్వ‌జిత్ ఫోన్ లిఫ్ట్ చేసి బ‌తికే ఉన్నానని కానీ విప‌రీత‌మైన నొప్పిగా ఉంద‌ని చెప్పాడు. దాంతో వెంట‌నే హేలారాం క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా తెలిసిన ఆంబులెన్స్ డ్రైవ‌ర్‌ను మాట్లాడుకుని ఒడిశాలోని బెల‌సోర్ జిల్లాకు వెళ్లాడు. అయితే బెల‌సోర్‌కి వెళ్లిన‌ప్ప‌టికీ విశ్వ‌జిత్ ఏ హాస్పిట‌ల్‌లోనూ క‌నిపించ‌లేదు. అయినా హేలారాం ప‌ట్టు వ‌దల్లేదు. ఆచూకీ కోసం వెతుకుతుండ‌గా.. ఓ వ్య‌క్తి హాస్పిట‌ల్లో లేక‌పోతే మార్చ‌రీ రూంలో ఉండ‌వ‌చ్చ‌ని తెలిపాడు. దాంతో వెంట‌నే బాల‌సోర్ హాస్పిట‌ల్‌లోని మార్చ‌రీకి వెళ్లి చూసారు. వంద‌ల శ‌వాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ప‌డి ఉన్నాయి. అందులో త‌న కొడుకు చ‌నిపోయాడ‌నుకుని క‌వ‌రు కప్పి ఉంచారేమోన‌ని ప్ర‌తి శ‌వాన్ని చూస్తూ ఉండ‌గా ఓ వ్య‌క్తి చెయ్యి వ‌ణుకుతూ క‌నిపించింది. క‌వ‌రు తీసి చూడ‌గా.. అది త‌న కుమారుడేన‌ని హేలారాం సంతోషించాడు. వెంట‌నే విశ్వ‌జిత్‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతానికి అత‌నికి ఒక స‌ర్జ‌రీ అయింద‌ని, ఇంకో స‌ర్జ‌రీ చేయాల్సి ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. హేలారాం రావ‌డం మ‌రింత ఆల‌స్యం అయివుంటే విశ్వ‌జిత్ ప్రాణాల‌తో ఉండేవాడు కాదు.