మహాకాళేశ్వర్ దేవాలయంలో విరుష్క జంట
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబ సమేతంగా మద్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయాన్ని దర్శించుకున్నారు. విరాట్, అనుష్క జంట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసింది. పూజారి మంత్రాలు జపిస్తుండగా విరాట్ కూడా మంత్రాలను ఉచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా క్రికెటర్లు మ్యాచ్‌లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతోనో గడుపుతూ తెగ సందడిచేస్తుంటారు. అందులో భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన పనేలేదు. తన సతీమణి యాక్టర్ అనుష్క శర్మతో కలిసి చక్కర్లు కొడుతూ.. వాటికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా కోహ్లీ, అనుష్క జంట మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించిన వీడియో వైరల్‌గా మారింది.
తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కోహ్లీ టీమ్ఇండియా సభ్యుడిగా ఉన్నాయి. అయితే మూడో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో కాస్త విరామం దొరికింది. ఇకేముంది.. విరుష్క దంపతులు ఓ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. స్వామిరికి జరిగిన ప్రాతఃకాల పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు కోహ్లీ, అనుష్కలను చూసి ఆశ్చర్యంతోపాటు ఆనందానికి లోనయ్యారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలువడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. రెండో బెర్త్ కోసం టీమిండియాలో నాలుగో టెస్టులో గెలిస్తే డబ్ల్యుటిసి ఫైనల్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0తో సిరీస్ సొంతం చేసుకుంటే టీమిండియా డబ్ల్యుటిసి ఫైనల్లో కనిపించదు.
అయితే రన్‌మెషీన్‌గా పేరుతెచ్చుకున్న కోహ్లీ.. గతకొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా, ఛేజింగ్ మాస్టర్‌గా రికార్డులు బద్ధలు కొట్టిన విరాట్.. టెస్టుల్లో మాత్రం ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. భారీస్కోర్ కాదుకదా కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో కోహ్లీ అత్యధిక స్కోర్ 46. మిడిలార్డర్లో కీలకమైన ఈ స్టార్ ప్లేయర్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరుతూ ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తున్నాడు. నాలుగో టెస్టులో అయినా అతడు శతకం బాదాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే..? కింగ్ కోహ్లీ టెస్టుల్లో మూడంకెల స్కోర్ చేసి దాదాపు మూడేళ్లు దాటుతోంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది.
ఆసియా కప్‌తో ఫామ్‌లోకి
దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న అతను కొన్ని రోజులు ఆటకు దూరమయ్యాడు. విరామం తర్వాత మైదానంలోకి దిగిన కోహ్లీ ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. శ్రీలంకపై సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లోనూ రాణించాడు. పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి మునపటి విరాట్‌ను గుర్తు చేశాడు. బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్‌లో ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. విరాట్ ఇదే ఫామ్‌తో కొనసాగాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.