Shivaratri: జాగరణ.. ఉపవాసం.. అభిషేకం ఎలా చేయాలి?

Shivaratri: ఈ నెల 8న మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం. ఈ శివ‌రాత్రి రోజున ఒక ఐదు ప్ర‌క్రియ‌ల‌తో ప‌ర‌మేశ్వ‌రుడిని అర్చించ‌గ‌లిగితే పాపాల‌న్నీ తొల‌గిపోతాయి. స‌మ‌స్త‌మైన క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌చ్చని లింగ పురాణం చెప్తోంది. ఆ ఐదు ప్ర‌క్రియ‌లు ఏంటంటే.. అభిషేకం, అర్చ‌న‌, జాగ‌ర‌ణ‌, ఉప‌వాసం, శివ‌నామస్మ‌ర‌ణ‌. ఇవ‌న్నీ ఎలా చేయాలి? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.

శివ‌రాత్రి వ‌స్తోంది కాబ‌ట్టి.. ఇంట్లో చిన్న శివ లింగం ఉంటే మంచిది. ఇంట్లో శివ లింగం పెట్టుకుంటే కొంప‌లు అంటుకుపోతాయి, రోజూ అర్చ‌న చేయాలి లేక‌పోతే ఆ ఇంట్లో ప్ర‌మాదాలు జ‌రిగిపోతాయి అంటుంటారు. ఇవ‌న్నీ భ‌యాలంతే. చక్క‌గా శివ‌లింగం తెచ్చిపెట్టుకోండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజ చేసుకోండి. బాణ లింగాలు, ర‌స లింగాలు వంటివి తెచ్చుకోకండి. వీటికి నియ‌మాలు పాటించాల్సిందే. కాబ‌ట్టి చిన్న లింగాన్ని తెచ్చుకుని పూజించుకోవ‌చ్చు. అంటే వెండివి, ఇత్త‌డివి, రాగివి వంటివి తెచ్చుకోవ‌చ్చు. లేదంటే మట్టితో చిన్న లింగం చేసుకున్నా ఫ‌ర్వాలేదు. (Shivaratri)

అభిషేకం ఎలా చేయాలి?

అభిషేకం ఇచ్చే ఫ‌లితాన్ని వర్ణించ‌లేం. ఎలా చేయాలంటే అభిషేకం.. దానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొద‌టి మార్గం ఏంటంటే.. వైదికం. ఒక‌వేళ మ‌హ‌న్యాసం, ల‌ఘున్యాసం, న‌మ‌కం, చ‌మ‌కం కానీ చ‌ద‌వ‌డం వ‌స్తే చ‌క్క‌గా శివ లింగానికి అభిషేకం చేసుకోవ‌చ్చు. అయితే ఒక‌టి గుర్తుపెట్టుకోండి. స్వ‌రం రాక‌పోతే వేదం చ‌ద‌వ‌కూడ‌దు. స్వేదానికి స్వ‌రం చాలా ముఖ్యం. అందుకే గురువు ద‌గ్గ‌ర నేర్చుకుని చ‌ద‌వాలే త‌ప్ప పుస్త‌కాలు చూసి వేదం నేర్చుకోకూడ‌దు. అలా చేయ‌డం ఎప్పుడూ శ్రేయ‌స్క‌రం కాదు. వేదాన్ని స్వ‌రంతోనే చ‌ద‌వాలి. వేదాలు రాక‌పోతే ఎలా? ఇందుకు ఏం చేయాలంటే.. సురాగ‌య మ‌హ‌ర్షి 15 శ్లోకాల రూపంలో రుద్ర మంత్రాల‌ను ఇచ్చాడు. అది ఎవ‌రైనా చ‌ద‌వ‌చ్చు. వేదాలు రాక‌పోయినా స్వ‌రం లేక‌పోయినా ఈ శ్లోకాల‌ను చ‌దువుకోవ‌చ్చు. సాయంత్రం 6 నుంచి మ‌రుస‌టి రోజు 6 వ‌ర‌కు ఉన్న స‌మ‌యంలో ఈ అభిషేకం ఎప్పుడైనా చేయొచ్చు.

శివ‌నామ‌స్మ‌ర‌ణ ఎలా చేయాలి?

పంచాక్ష‌రి మంత్రం వ‌స్తే అది చ‌క్క‌గా చ‌దువుకోండి. ఒక వెయ్యి సార్లు చేస్తే మంచిది. మంత్రాలు, ఉప‌దేశాలు లేక‌పోతే శివాయ గుర‌వే న‌మః అంటే.. ప‌ర‌మేశ్వ‌రుడే నా గురువు అనుకుంటూ నామం జ‌పించినా స‌రిపోతుంది.

ఉప‌వాసం ఎలా చేయాలి?

శివ‌రాత్రి రోజున త‌ప్ప‌కుండా ఉప‌వాసం చేయాలి. ఉప‌వాసం అంటే ఏంటి? తిండి మానేయ‌డం మాత్ర‌మే కాదు. ఏద‌న్నా తినడం మానేసి ఉప‌వాసం చేయ‌డం మంచిదే. ప్ర‌తి పండ‌క్కి రుషులు ఈ ఉప‌వాసాన్ని లింక్ చేసి పెట్టారు. అలాగ‌ని అంద‌రూ చేయాల‌ని లేదు. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉప‌వాసం చేయ‌కూడ‌దు. అస‌లైన ఉప‌వాసం ఏంటంటే.. మ‌న మ‌న‌సు దైవానికి ద‌గ్గ‌ర‌గా ఉండడం. దీనిని ఉప‌వాసం అంటారు.

జాగ‌ర‌ణ ఎలా చేయాలి?

రాత్రంతా నిద్ర‌మానేసి సినిమాలు చూడ‌టం జాగ‌ర‌ణ అనుకుంటారు. అది చాలా త‌ప్పు. లౌకిక విష‌యాల‌పై నిద్ర‌పోయి భ‌గవంతుడికి సంబంధించిన అంశాల‌పై ఫోక‌స్ చేసి నిద్ర‌పోకుండా ఉంటే అది జాగ‌ర‌ణ‌. రాత్రంతా ప్ర‌వ‌చ‌నాలు, మంత్రాలు, ప‌ర‌మేశ్వ‌రుడి పాట‌లు పాడుకుంటూ నిద్ర‌పోకుండా ఉంటే ఆ జాగ‌ర‌ణ‌కు ఫ‌లితం ఉంటుంది. అంతేకానీ సినిమాలు చూస్తూ, పేకాట ఆడుతూ కూర్చుంటే అది జాగార‌ణ అవ్వ‌దు. ఇలా చేసే బ‌దులు జాగారం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.