SSMB 29: రాజమౌళి రిస్కీ నిర్ణయం
SSMB 29: దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) తీయబోయే సినిమా కోసం అన్నీ సెటప్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ నడుస్తోంది. ఈ సినిమా ఒక గ్లోబల్ అడ్వెంచర్‌లా ఉండబోతోందని హైప్ పెంచేసారు రాజమౌళి. ఇందులో హాలీవుడ్ నటుడు కూడా యాక్ట్ చేయబోతున్నాడని అన్నారు. అయితే ఎవరా హాలీవుడ్ నటుడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
అయితే ఏది ఏమైనా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాలన్న కసితో ఉన్నారు రాజమౌళి. అదీకాకుండా ఇప్పుడు మహేష్ బాబుకు గ్లోబల్ హిట్ ఎంతో అవసరం. ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు తమ సత్తా ఏంటో ప్యాన్ ఇండియాకి చూపించేసారు. ఇప్పుడు టాలీవుడ్లో హాలీవుడ్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు సత్తా ఏంటో కూడా ప్రపంచానికి తెలియాల్సి ఉంది. అది రాజమౌళి చేతిలోనే ఉంది. అందుకే సినిమాకు సంబంధించిన ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. RRR వరకు పనిచేసిన టెక్నికల్ టీంలోని కొందరు వ్యక్తులను కూడా రాజమౌళి పక్కన పెట్టేసారు. వారి స్థానంలో వేరొకరిని నియమించుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రాజమౌళి ఒక విషయంలో రిస్క్ తీసుకున్నారు అన్న టాక్ నడుస్తోంది. అదేంటంటే.. రాజమౌళి ఎప్పుడూ కూడా తన సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్‌ను ఎంపికచేసుకుంటారు. కానీ ఈసారి రాజమౌళి సాబు సిరిల్‌ను (Sabu Cyril) పక్కన పెట్టి మోహన్ బంగి (Mohan Bangi) అనే ప్రొడక్షన్ డిజైనర్‌ను నియమించుకున్నారు. మోహన్ బంగి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఆదిపురుష్‌కు (Adipurush) ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ సినిమాలో ఒక్క మ్యూజిక్ తప్ప మిగతావన్నీ మైనస్ పాయింట్సే. ఫ్యాన్స్ కూడా తిట్టుకునేలా తీసాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut). అలాంటి డిజాస్టర్ ఆదిపురుష్ టెక్నికల్ టీం నుంచి మోహన్ బంగిని రాజమౌళి ఎంపిక చేసుకున్నారంటే సాహసమనే చెప్పాలి. అయినా ఒకరి వల్ల సినిమా డిజాస్టర్ అయితే అందరినీ అనడం సబబు కాదు కదా..! రాజమౌళి ఏ నిర్ణయం తీసుకున్నా ది బెస్ట్‌గానే ఉంటుంది. ఆయన మోహన్ బంగిని నమ్మి తన సినిమాకు సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎంపికచేసారంటే మోహన్ బంగిలో ట్యాలెంట్‌ని చూసే అవకాశం ఇచ్చి ఉంటారు. మరి SSMB 29కి సంబంధించి ఏదన్నా గ్లింప్స్ కానీ టీజర్ కానీ వస్తే అప్పుడు మోహన్ బంగి పనితనం ఎలా ఉందో తెలిసిపోతుంది.
ఇక సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ హనుమంతుడిని పోలి ఉంటుందని అంటున్నారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యి మహేష్ కోసం ఓ క్యారెక్టర్ డిజైన్ చేసారు జక్కన్న. భారత సంప్రదాయాలకు ఈ సినిమా దగ్గరగా ఉండబోతోంది. సినిమా ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ ఆధారంగా ఉండబోతోంది కాబట్టి డ్రామా, ఫైట్స్‌కి అసలు కొదవే ఉండదు అని విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కూడా కన్ఫామ్ చేసేసారు.