Zomato: 72% పేమెంట్స్ రూ.2000 నోట్ల‌తోనే..!

Hyderabad: ఈ రెండు రోజుల్లో జొమాటో (zomato) ఆర్డ‌ర్ల నుంచి 72% రూ.2000 నోట్లతోనే చెల్లింపులు అయ్యాయ‌ట‌. రూ.2000 నోటు విత్‌డ్రా చేసుకుంటున్న‌ట్లు ఆర్‌బీఐ(rbi) ప్ర‌క‌టించ‌గానే ఎలాగైనా ఆ నోట్ల‌ను వాడేయాల‌ని చూస్తున్నారు ప్ర‌జ‌లు. వీలున్న చోట రూ.2000 ఇచ్చేసి చిల్ల‌ర తీసుకుంటున్నారు. మ‌రీ రూ.50 విలువైన వ‌స్తువుకు కూడా చేంజ్ లేదంటూ రూ.2000 నోట్లు ఇచ్చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో జొమాటో వెల్ల‌డించిన వివ‌రాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రూ.2000 నోట్లు విత్‌డ్రా అని శుక్ర‌వారం ఆర్‌బీఐ ప్ర‌క‌టించ‌గానే.. జొమాటోకి ఎన్నో ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. అంద‌రూ క్యాష్ ఆన్ డెలివ‌రీ పెట్టి రూ.2000 నోట్లు ఇచ్చార‌ట‌. అలా శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు వ‌చ్చిన ఆర్డ‌ర్ల‌లో 72% రూ.2000 నోట్లు ఇచ్చిన‌వారే అని జొమాటో (zomato) తెలిపింది.

మ‌రోప‌క్క చాలా మ‌టుకు షాపులు రూ.2000 నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. దాంతో ప్ర‌జ‌లు తిప్ప‌లు ప‌డుతున్నారు. నోటును బ్యాన్ చేయ‌లేద‌ని కేవ‌లం వెన‌క్కి తీసుకోవాల‌నుకుంటున్నామ‌ని ఆర్‌బీఐ ఎన్నిసార్లు చెప్పినా కొంద‌రికి అర్థంకావ‌డంలేదు. బ్యాన్ చేసార‌ని అందుకే నోటు తీసుకోవ‌డంలేద‌ని అంటున్నారు. దాంతో షాపులు రూ.2000 తిర‌స్క‌రించ‌డానికి వీల్లేద‌ని ఆర్‌బీఐ తెలిపింది.