Supreme Court: ఇకపై వేశ్య‌ లాంటి ప‌దాలు వాడ‌కూడ‌దు

న్యాయ‌స్థానాల్లోని కేసుల విచార‌ణ‌, తీర్పుల్లో భాగంగా ఇక‌పై మ‌హిళా నేర‌స్థుల‌ను స్ల‌ట్, వేశ్య‌ అని సంబోధించ‌కూడ‌ద‌ని భార‌త‌దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం (supreme court) కొత్త ఆర్డ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టింది. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌లో భాగంగా మ‌హిళ‌ల ప్ర‌స్తావ‌న‌లో వాడాల్సిన‌, వాడ‌కూడ‌ని ప‌దాల‌కు సంబంధించి చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జ‌స్టిస్ చంద్ర‌చూడ్ (cji dy chandrachud) ఓ హ్యాండ్ బుక్‌ను రిలీజ్ చేసారు. ఈ పుస్త‌కానికి హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండ‌ర్ స్టీరియోటైప్స్ అని పేరు పెట్టారు.

గ‌తంలో ఎన్నో న్యాయ‌స్థానాల్లో మ‌హిళల కేసుల్లో భాగంగా తీర్పులు ఇస్తూ ఎన్నో అస‌భ్య‌క‌ర ప‌దాల‌ను వాడేవార‌ని ఇక‌పై అలాంటివి కుద‌ర‌వ‌ని చంద్ర‌చూడ్ స్ప‌ష్టం చేసారు. జెండ‌ర్‌కు సంబంధించి న్యాయ‌స్థానాల్లో ఇంకా మూస ప‌ద్ధ‌తే వాడుతున్నార‌ని, ఇక‌పై ఈ పుస్త‌కం ద్వారా ఎలాంటి ప‌దాల‌ను వాడాలో ఎలాంటివి వాడ‌కూడ‌దో న్యాయ‌మూర్తుల‌కు తెలుస్తుందని తెలిపారు. ఈ పుస్త‌కాన్ని సుప్రీంకోర్టు (supreme court) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.